28-03-2025 01:21:52 AM
సిద్దిపేట జిల్లాలో ఎన్ని బోర్లు వేసినా నీరు అంతంతే
గత ఏడాదికంటే మరింత లోతుకు భూగర్భ జలాలు
పిల్ల కాలువలులేక రైతులకు ఇక్కట్లు
గజ్వేల్, మార్చి 27 : సిద్దిపేట జిల్లాలో భూగర్భ జలాలు తీవ్రస్థాయిలో అడుగంటిపోతున్నాయి. సాగునీటి కోసం రైతుల కు ఇబ్బందులు తప్పడంలేదు. పంటలను కాపాడుకోవడానికి రైతులు ఎన్ని బోర్లు వేసినా.. వృథాగానే మారుతున్నాయి. వేసిన బోర్లలో తడి కూడా రాకపోవడంతో రైతు లు నిరాశకు గురవుతున్నారు.
చిన్న, సన్నకారు రైతులు పంటలు ఎలా కాపాడుకో వాలో తెలియక సతమతమవుతు న్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కాలువలు ఉన్నా కొన్ని ప్రాంతాల రైతులకే నీరు అందుతుంది. పిల్ల కాలువల నిర్మా ణం జరగకపోవడంతో రైతులకు ప్రాజెక్టుల నుంచి సాగునీరు అంద డం లేదు. సిద్దిపేట జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే అక్బర్‌పేట భూంపల్లి మండలం లో అత్యధికంగా 6.05 మీటర్లు తగ్గి 19.31 అడుగుల లోతుకు నీటిమట్టం చేరింది.
మర్కుక్ మండలంలో అత్యల్పంగా 0.29 మీటర్లు తగ్గి 14.95 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో రోజుకు 10 నుంచి 20 బోర్లు వేస్తున్నా నీటి జాడ దొరకడం లేదు. దౌల్తాబాద్, రాయపోల్ తదితర మండలాల్లో ఉన్న బోర్లలో నీరు తగ్గడంతో అదనంగా రెండు మూడు బోర్ల వరకు వేస్తున్నారు. అయినా నీరు రాకపోగా రైతులు అప్పుల పాలవుతున్నారు.
పిల్ల కాలువలతోనే మేలు
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి పిల్ల కాలువలను రైతుల పొలాల వరకు నిర్మిస్తే సాగునీటి కష్టాలు తీరుతాయని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పిల్ల కాలువల నిర్మాణాలను ప్రభుత్వం త్వరగా పూర్తి చేసి, నీటిని సరఫరా చేయాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు.