calender_icon.png 20 October, 2024 | 2:55 AM

పంట వేసిన భూములకే రైతు భరోసా

20-10-2024 01:03:17 AM

  1. సబ్‌కమిటీ నివేదిక తర్వాత రైతుల ఖాతాలకు
  2. డిసెంబర్‌లోగా 2 లక్షల పైనున్న రుణాలు మాఫీ
  3. వచ్చే సీజన్ నుంచే రైతు బీమా అమలు 
  4. వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో పంట వేసిన భూములకే రైతు భరోసా అందుతుందని, మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చిన తర్వాత రైతుల ఖాతా లో ఎకరాకు సీజన్‌కు రూ.7,500 చొప్పున జ మ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

దేశం లో ఎక్కడలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని, ఆర్థిక కష్టాలున్నా అన్నదాతలను ఆదుకున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల బడ్జెట్‌లో రైతు సంక్షేమానికి రూ.50 వేల కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు.

శనివారం బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉన్న రైతు కుటుంబాలను గుర్తించి డిసెంబర్‌లోగా వారి ఖాతాల్లో నిధులు జమ చేస్తామన్నారు. ఇందుకోసం త్వరలోనే షెడ్యూల్ ప్రకటించి.. అర్హులైన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

పంటబీమా పథకాన్ని వచ్చే సీజన్ నుంచి అమలు చేస్తామని, ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. త్వరలోనే ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలకే అన్నీ పంటలను కొనుగోలు చేస్తున్నప్పటికీ ప్రస్తుతం 25 శాతమే తీసుకుంటుందని, పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించారు.

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రుణమాఫీ రైతుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తోందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలను ఇప్పటివరకు అమలు చేయలేదని స్పష్టం చేశారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ, రైతు సంఘాల నేతలు సారంపల్లి మల్లారెడ్డి, పశ్య పద్మ, నల్లమల్ల వెంకటేశ్వరరావు, లోకసాని పద్మారెడ్డి పాల్గొన్నారు.

చిరుధాన్యాలకు ప్రాధాన్యమివ్వాలి

ఆహారంలో చిరుధాన్యాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. జొన్నలు, సజ్జలు, రాగులు వంటి అనేక చిరుధాన్యాలు తక్కువ నీటిని వినియోగించుకొని.. తడి వాతావరణంలోనూ పెరుగుతాయన్నారు. శనివా రం హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ పోషక చిరుధ్యానాల సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

తెలంగాణలో ఒకవ్యక్తి రోజుకు సగటున కేవలం 20 గ్రాముల చిరుధాన్యాలు మాత్రమే తీసుకుంటున్నారని, ఇంకా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. 1980 దశకంలో 9 మిలియన్ టన్నులున్న చిరుధాన్యాల ఉత్పత్తి ప్రస్తుతం 4.5 మిలియన్ టన్నులకు తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు.