calender_icon.png 23 October, 2024 | 1:03 PM

రైతు భరోసా ఆగలే

05-05-2024 12:16:51 AM

6 కల్లా రైతులందరికీ అందజేస్తాం.. లేదంటే నా ముక్కు నేలకు రాస్తా: సీఎం రేవంత్

అందరికీ రైతు భరోసా అందితే.. కేసీఆర్ నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావా? 

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తా

400 సీట్ల వెనుక బీజేపీ భారీ కుట్ర 

ఖమ్మం రాజకీయాలు దేశానికే దిక్సూచీ కావాలి

భద్రాద్రి కొత్తగూడెం జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం/వనపర్తి (విజయక్రాంతి) మే 4: రైతుభరోసా పథకంలో మొత్తం 69 లక్షల మంది రైతులుంటే, ఇప్పటి వరకు 65 లక్షల మందికి డబ్బులు అందజేశామని మిగిలిన నాలుగు లక్షల మంది రైతులకు ఈనెల 8వ తేదీలోపు  రైతుభరోసా పథకం కింద డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కేసీఆర్ రాష్ట్రంపై  పెట్టిన అప్పుల కుంపటిని దించేందుకు నానా కష్టాలు పడుతున్నామన్నారు. మే ౮వ తేదీ లోపు ఏ ఒక్క రైతుకు రైతుభరోసా పడకున్నా అమరవీరుల స్థూపం సాక్షిగా నా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తాను.. ఒకవేళ అందరికి రైతుభరోసా అందితే కేసీఆర్ నీ ముక్కు నేల రాసి క్షమాపణ చెప్తావా అని ఆయన ప్రశ్నించారు. 

మే 9వ తేదీన అమరవీరుల స్థూపం సాక్షిగా చర్చకు వస్తావా అని కేసీఆర్‌కు  సీఎం రేవంత్ సవాల్ విసిరారు.  రైతు భరోసా పథకం ఆగిపోయిందని కేసీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థులు రామసహాయం రఘురాంరెడ్డి, బలరాం నాయక్‌ల విజయాన్ని కాంక్షిస్తూ శనివారం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

రూ. 7లక్షల కోట్లు అప్పుతో దివాళా తీసిన సంసారం తెలంగాణ రాష్ట్రమని, కేసీఆర్ చేసిన అప్పులను తీర్చడానికి ఇబ్బంది పడుతున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రజలకు ఇవ్వాల్సిన ఆసరా పింఛన్లు, ఉద్యోగుల వేతనాలు ఆగలేదన్నారు. ఆగస్టు 15లోపుగా భద్రాచలం రాములవారి సాక్షిగా రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి రాష్ట్రానికి పట్టిన చీడపీడ శనీశ్వరరావులను సిద్దిపేటలోనే పాతిపెట్టేలా చేస్తామన్నారు. హరీశ్ రావు దూలంలా పెరిగాడు కాని దూడకు ఉన్న బుద్ధికూడా లేదని ఎద్దేవాచేశారు. పదేళ్ల మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తాడనే 

 ఆశ లేదని, మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్‌ను రద్దుచేసే కుట్ర పన్నుతున్నారని ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని మార్చడం, రిజర్వేషన్‌లు రద్దు చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తున్నదన్నారు. అందువల్లనే గత పది సంవత్సరాలుగా కులగణన, జనాభాలెక్కల సేకరణ చేపట్టలేదన్నారు. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి రావాలని 400 సీట్లు కావాలని అడుగుతున్నారన్నారు. 400 సీట్లు రాజ్యాంగాన్ని మార్చడం కోసమే అని ఆరోపించారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామిరెడ్డికి అండగా నిలవడానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి, రాష్ట్ర, జిల్లా నాయకత్వం, సీపీఐ, సీపీఎం, జనసమితి అందరూ కలిసికట్టుగా రావడం సంతోషకరమన్నారు.

ఖమ్మం జిల్లా రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా అని, ఇక్కడి రాజకీయం దేశానికే  దిక్సూచిగా నిలవాలన్నారు.  కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ఖరారైందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో 2014,2018,2023 ఎన్నికలను నిశితంగా పరిశీలీస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంతో చైతన్యవంతులు అనే వారు ఎంత విలక్షణమైన తీర్పు ఇస్తారో స్పష్టమైందన్నారు. నయవంచక నక్కజిత్తుల మాటలకు ఈ జిల్లా ప్రజలు లొంగలేదని, కేసీఆర్ కుట్రను పసిగట్టి ఆయన దుర్మార్గాన్ని పాతిపెట్టింది ఉమ్మడి ఖమ్మం జిల్లా అని ఆయన అన్నారు. 2014 నుంచి 2023 వరకు రైతు వ్యతిరేక నల్లచట్టాలు వచ్చినప్పుడు, జీఎస్టీ బిల్లు చేసినప్పుడు బీజేపికి వ్యతిరేకంగా ఎందుకు బీఆర్‌ఎస్ మాట్లాడలేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకే తాను గుడ్డలని ఆరోపించారు. కారు పాతసామాన్లుకు తూకం వేసే రోజులు దగ్గర పడ్డాయని, కిలోల  చొప్పున అమ్ముకోక తప్పదని, ఇక రాష్ట్రంలో కారు అధికారంలోకి రావడం కష్టం అన్నారు. డిసెంబర్ 3న వచ్చిన ఫలితాలు సెమీ ఫైనల్స్ మాత్రమేనని, మే 13న జరిగే ఎన్నికలు ఫైనల్ అని, ఈ ఫైనల్స్‌లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ టీములు పోటీపడుతున్నాయని చెప్పారు.

గుజరాత్‌ను ఓడించి రాహూల్‌గాంధీని గెలిపించుకొందామని పిలుపునిచ్చారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది బీజేపీ పార్టీ అని దుయ్యపట్టారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు  సందర్భంగా ప్రధాని మోదీ తెలంగాణను అవమానించారన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి గాడిదగుడ్డు ఇచ్చిందని, అలాంటి బీజేపీకి ఓటు వేద్దామా.. కర్రుకాల్చి వాతపెడదామా అని ప్రజలను అడిగారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, కేంద్రంలో రాహూల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయకులను సభావేదిక నుంచి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, ఎమ్మేల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీపీఎం నాయకులు పోతినేని సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. 

కురుమూర్తి సాక్షిగా రుణమాఫీ

మహబూబ్‌నగర్ జిల్లాలో కొలువై ఉన్న కురుమూర్తి స్వామి సాక్షిగా ఆగస్టు 15వ తేదీన రూ 2 లక్షల రుణమాఫీ చేసి రైతన్నలకు బ్యాంకుల నుంచి స్వాతంత్య్రం కల్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాజీనామాకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. శనివారం కొత్తకోట సభలో ఆయన మాట్లాడుతూ తాను సమాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర సీఎంగా ఎదిగానని, ఎవరి పేరు చెప్పుకొని అడ్డదారిలో రాలేదని ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడి 150 రోజులు కాకముందే కాకులు, గద్దలాగా కత్తులు తీసుకుని సీఎం రేవంత్ రెడ్డిని దించాలని, జైలుకు పంపాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పాన్‌గల్ జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అందలం ఎక్కించిన కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని దొంగలతో కలిసి కంకణం కట్టుకున్నావా? అని బీజేపీ అభ్యర్థి డీకే అరుణను సీఎం ప్రశ్నించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో క్రషర్, సారాయి దందా, కల్లు దందా ఎవరివో ప్రజలకు తెలుసు అని అన్నారు. రుణమాఫీపై తనతో సవాల్‌చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తన రాజీనామాను సిద్ధంచేసుకోవాలని సీఎం సూచించారు. 

కేటీఆర్ చీర కట్టుకుంటే తెలుస్తది

‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఏం చేయలేదని మాట్లాడుతున్న కేటీఆర్.. చీర కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కాలని, అప్పుడు బస్సులో టికెట్ తీసుకుంటే తాను ఏమీ చేయనట్టేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సెమీ ఫైనల్ మాత్రమేనని, ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో గుజరాత్ టీంను పడగొట్టాలని పిలుపునిచ్చారు.