దమ్మపేట (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అప్పారావుపేట నియోజకవర్గం పరిధిలోని దమ్మపేట మండలం మొద్దులగూడెం ఎంపీ యుపిఎస్ పాఠశాలలో బుధవారం జెన్కో ఏఈ ని సన్మానించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తెలంగాణ జెన్కోలో ఏఈ గా ఉద్యోగం సాధించిన కుంజా రేవతిని పాఠశాల అధ్యాపక బృందం శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బండి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తమ పాఠశాలలో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవటం సంతోషంగా ఉందన్నారు. మంగళవారం పాల్వంచలో విధులలో చేరిన రేవతిని ఆదర్శంగా తీసుకొని పాఠశాలలోని పిల్లలు కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవతి తన స్వగ్రామమైన తొట్టిపంపు నుండి వచ్చి చదువుకునేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు.