calender_icon.png 24 January, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ వైపు.. ప్రపంచ దేశాల చూపు

24-01-2025 01:31:39 AM

  • సీఎం బృందం దావోసు నుండి లక్ష కోట్ల పెట్టుబడులతో  తీసుకొస్తున్నారు. 
  • 26వ జనవరి నుండి రైతు భరోసా 12 వేలు భూమిలేని వారికి 6 వేలు
  • బీఆర్‌ఎస్ రైతు దీక్షపై కేటీఆర్‌ను నల్లగొండ  ప్రజలు నిలదీయాలి
  • పేద మహిళలకు సంవత్సరానికి రెండు చీరలు. 60 లక్షల మందికి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి, వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

యాదాద్రి భువనగిరి జనవరి 23 (విజయ క్రాంతి): తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ దేశాలన్నీ ముందుకు వస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బృందం లక్ష కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తున్నారని తెలిపారు.

గురువారం రోజు భువనగిరి, వలిగొండ నూతన వ్యవసాయ  మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారానికి ముఖ్యఅతిథిగా హాజరై  జ్యోతి ప్రజ్వలన చేసి రెండు పాలకవర్గ కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ గత టిఆర్‌ఎస్ పాలలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి అన్ని వర్గాల ప్రజలను సంతోషంగా ఉంచడానికి తమ ప్రభుత్వం దీక్ష పట్టుదలతో పనిచేస్తుందని అన్నారు.

తెలంగాణ బాగుపడడం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు ఇష్టం లేదని  ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రాణాలకు తెగించైనా తెలంగాణ ప్రజలను కాపాడుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి ఆవేశంగా అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు నల్లగొండలో రైతు దీక్ష చేపడతారట ఎందుకు. మీ హాయంలో ప్రజలకు చేయని మేలు మేం చేస్తున్నందుకా అని ప్రశ్నించారు. నల్లగొండ ప్రజలు కేటీఆర్ ను దీక్ష ఎందుకు చేస్తున్నావని నిలదీయాలని అన్నారు.

రైతాంగానికి కావాల్సిన నిధులు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతులకు మేలు చేసే విధంగా  మార్కెట్ యార్డ్ ల అభివృద్ధి కొరకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులతో అన్ని రకాల పంటలు పండించే విధంగా కమిటీ చైర్మన్ లు కష్టపడి పని చేయాలన్నారు. రైతులు ధైర్యంగా  వ్యవసాయం చేసుకునేందుకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు.

మార్కెట్ కమిటీ యార్డ్ లకు గోడౌన్లు, కాంప్లెక్స్, భవనాలు మంజూరు చేయడం  జరుగుతుందన్నారు. రైతులు పండించిన పంటలు ధాన్యం కొనుగోలు సెంటర్లు లో అమ్మిన మూడు రోజుల్లోనే రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. రైతులు పండించిన సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. రైతులకు రుణమాఫీ కూడా చేయడం జరిగిందని అన్నారు.

ఎన్ని కష్టాలు ఉన్నా రైతన్నలను, నేతన్నలను మరోద్దని ముఖ్యమంత్రి పదేపదే గుర్తు చేస్తారని తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఒక రేషన్ కార్డు, ఒక్క ఇల్లు కూడా ఇవ్వనందుకు సిగ్గుతో తలదించుకోవాలని మంత్రి మండిపడ్డారు. తమ ప్రభుత్వం పరులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తద్వారా అందరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

నియోజకవర్గానికి 3500 చొప్పున ఇస్తున్నామని అందుకు 22 వేల కోట్లు ఖర్చు అవుతుందని ఆ విధంగా లక్ష కోట్ల ఖర్చుతో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని తమ ప్రభుత్వం తీసుకుందని మంత్రి వివరించారు. పేద మహిళలకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 60 లక్షల మంది మహిళలకు చీరలు అందజేయాలని నిర్ణయించి చేనేత కార్మికులకు పని కల్పించడానికి ఆర్డర్లు కూడా ఇచ్చామని మంత్రి తెలిపారు.

జనవరి 26 తేదీన రైతు భరోసా ఎకరాకు 12 వేల రూపాయలు. భూమి లేని నిరుపేదలకు 6 వేల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెల్లిస్తారని అన్నారు. ప్రభుత్వం పోయిందని ప్రతి కార్యక్రమానికి టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు అడ్డు తగులుతూ ప్రజల మెప్పు పొందాలని చూస్తున్నారు కానీ ఇప్పటికే ప్రజలు పెట్టిన వాతలు సరిపోవా అని ఆయన ఎద్దేవా చేశారు.  

టిఆర్‌ఎస్ పార్టీ నాయకులకు తెలంగాణ సస్యశ్యామలం కావడం, మహిళలు సంతోషంగా ఉండడం, రైతులు సంతోషంగా ఉండడం వారికి ఇష్టం లేదని మంత్రి అన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య మాట్లాడుతూ రైతులకు సేవ చేసే  భాగ్యం  నూతన పాలకవర్గ సభ్యులకు దక్కిందని, బాధ్యతగా పనిచేసి మార్కెట్ కమిటీ అభివృద్ధి పై దృష్టి పెట్టాలన్నారు.

భువనగిరి శాసనసభ్యులు కుంభంపాటి  అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ  నూతనంగా ఎన్నుకున్న పాలకమండలి   పదవులు బాధ్యతతో  నిర్వహించి అభివృద్ధి కోసం కృషి చేయాలని అన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మార్కెట్ కమిటీ పాలకవర్గాలు రైతన్నలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి,రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి,గ్రంథాలయ  చైర్మన్ అవేజ్ చిస్తీ, మున్సిపల్  చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు,  మార్కెట్ కమిటీ చైర్మన్  కునుకుంట్ల రేఖ బాబురావు, వైస్ చైర్మన్ రాజేష్ పైలెట్, టిపిసిసి డెలిగేట్ నెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, పాలకవర్గ సభ్యులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.