calender_icon.png 21 April, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇప్పపూలు

21-04-2025 01:51:30 AM

ఇప్పచెట్టుకు వేలాడిన కనుగుడ్లు 

రాత్రింబవళ్లు గుడ్లు అప్పగించి 

చూసిచూసి రాళ్లవానల 

రాలిపోయాయి

భూమికి మచ్చలు లేని

తెల్లని రంగేసుకున్నప్పుడల్లా 

ముసలవ్వ గంపలో మునిగిపోయాయి 

ఎండలో ఎండి గుండ్రని మొహాన్ని 

ముడతలుగా మార్చుకుంటే తప్ప 

దానికి విలువ లేదు 

పూసుకు ఆకుదుప్పటి కింద 

నలిగి పోతేనేగాని 

మొక్కజొన్నలను ఆలింగనం చేసుకొని 

వందలు వందలుగా 

కుందనపు కుడుములుగా మార్చుకున్నాయి 

బస్తాల్లో మగ్గిమగ్గి 

చౌకధర దుకాణంలో 

కునుకు లేస్తున్నప్పుడు 

మిల్లు పట్టిన అటుకులు లాగా 

అలిగి కూర్చున్నాయి

కుండలో నీళ్లు తాగి 

కడుపు ఉబ్బినట్లు 

బొర్రలు పెంచుకొని 

సాంప్రదాయ సారాయిగా మార్చుకుంది 

లేత బుగ్గలను ఎండలో మాడ్చుకొని 

ఓపిగ్గా విశ్రాంతి తీసుకున్నప్పుడు 

బల్లదెబ్బలకు కడుపులో 

పేగులను రాల్చుకొని 

గిరిజనుల కడుపు మాత్రం నింపుతుంది

ఎంత ప్రేమో!

ఇప్పపువ్వుకు ఆదివాసీలకు 

ఉన్నంత చుట్టరికం మరెవ్వరికీ లేదు 

చిలకలో పలకరించిన కొద్దీ 

మొఖం మెరుపులా వెదజల్లుతుంది.

- పెనుక ప్రభాకర్