calender_icon.png 23 December, 2024 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులపై అక్రమార్కుల కన్ను

07-10-2024 12:00:00 AM

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు

కనుమరుగవుతున్న నీటి వనరులు

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ప్రజాప్రతి నిధుల పెత్తనం, అధికారుల స్వార్థం, కొందరి అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కు ల కన్ను చెరువులు, కుంటలపై పడింది. గత కొన్ని సంవత్సరాలుగా చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. వాటికి నీటిపారుదలశాఖ, రెవె న్యూ అధికారులు అనుమతులు ఇవ్వడం గమనార్హం. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి. 

జిల్లాలో 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు కలిగిన చెరువులు 167, అంతకంటే తక్కువ ఆయకట్టు ఉన్న చెరువులు 2,110 ఉన్నాయి. వీటిని ఆక్రమణకు  గురికాకుండా చూడాల్సిన రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారుల మధ్య లోపించిన సమన్వయం అక్రమార్కులకు వరంగా మారింది. 

పాల్వంచలో ఆక్రమణలు అధికం

పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో చెరువుల ఆక్రమణ దండిగా సాగుతోంది. పాతపాల్వంచలోని నేషనల్ హైవే పక్కన గల చింతచెరువు 99 ఎకాల విస్తీర్ణంలో ఉండాలి. చెరువు బఫర్‌జోన్‌లోనే పెట్రోల్‌బంకు కొనసాగుతున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. చింతలచెరువు నాలా(మత్తడి) 30 అడుగులు ఉండాల్సి ఉండగా ఆక్రమణల కారణంగా 6 అడుగులకు తగ్గింది.

చెరువును ఆక్రమించిన 20 మందికి మున్సిపాలిటీ నుంచి నోటీసులు అందాయి. పట్టణ పరిధిలోని నెహ్రూ నగర్ కాలనీల మధ్యగల రాతిచెరువు 35.2 ఎకరాలు ఉండాలి. పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ చెరువులో వందల సంఖ్యలో ఇళ్లు, ఇతర కట్టడాలు నిర్మించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు చేసి విక్రయాలు జరిపారు. ఇప్పటికే 105 మందికి నోటీసులు జారీ చేశారు.

దమ్మపేట కూడలి అయ్యప్ప ఆలయం ఎదురుగా 4.18 ఎకరాల్లో మేడికుంట చెరువు ఉంది. బీఆర్‌ఎస్  ప్రభుత్వంలో బఫర్‌జోన్‌తోపాటు చెవురును ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు సాగాయి. పాతపాల్వంచలో 15.36 ఎకరాల విస్తీర్ణంలో భూపతిరావు చెరువు ఉండాలి. చాలా వరకు శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయి. జగ్గుతండా ప్రాంతాల మధ్య 10.8 ఎకరాల్లో ఎర్రగుంట చెరువు విస్తీర్ణం ఉండాలి.

రెవెన్యూ, నీటి పారుదలశాఖ అధికారుల సమన్వయ లోపం కారణంగా శిఖం భూములు అన్యాక్రాంతమయ్యాయి. పట్టణంలోని జగ్గుతండా ప్రాంత  ల మధ్య 38.25 ఎకారల విస్తీర్ణంలో జోగారావు చెరువు ఉండాలి. ఎఫ్‌టీఎల్‌తో పాటు శిఖం భూములు ఆక్రమణకు గురయ్యాయి. పాల్వంచ ప్రధాన రోడ్డుపై గల కుంటినాగులగూడెం వద్ద గల మొర్రెడు వాగు బఫర్‌జోన్ పరిధిలో సుమారు 20 గుంటల వాగు ఒడ్డు ప్రాంతాన్ని అక్రమార్కులు అర ఎకరం వరకు ఆక్రమించి ప్రహరీ నిర్మాణం చేశారు.

పట్టణ పరిధిలోని చింతకుంట చెరువు 12.36 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలి. ప్రస్తుతం కుంట అన్యాక్రాంతమై ఆనవాళ్లు లేకుండా పోయింది. వీటితోపాటు నవభారత్ ఏరియాలోగల మంగచెరువు ఆక్రమణకు గురైంది. చంచుపల్లి మండల పరిధిలో కొత్తగూడెం రహదారిపై గల విద్యానగర్ కాలనీలోని చింతలచెరువు కూడా కబ్జాకు గురైంది. 

నోటీసులు జారీ చేశాం: ఈఈ 

చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించుకున్న వారికి, ఆక్రమించుకున్న వారికి నోటీసులు జారీ చేశామని నీటిపారుదలశాఖ ఈఈ అర్జున్ తెలిపారు. ఎవరైనా చెరువులు, కుంటలు, నాళాలు ఆక్రమించినట్లుతై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఆక్రమణకు గురైన చెరువుల వివరాలు

చెరువు పేరు ఉండాల్సిన ఆక్రమణకు గురైన 

విస్తీర్ణం(ఎకరాల్లో) విస్తీర్ణం(ఎకరాల్లో)

సింగబూపాలెం 1,234 400

చింతలచెరువు (పాతపాల్వంచ) 94.33 10

జోగారావు చెరువు  (పాల్వంచ) 33.23 2

దొంతికుంట చెరువు (అశ్వారావుపేట) 29.00 11

మేడికుంట చెరువు (పాల్వంచ) 12.29 5

చింతలచెరువు (విద్యానగర్‌కాలనీ) 14.00 5

రాతిచెరువు (పాల్వంచ) 35.02 3