calender_icon.png 26 March, 2025 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

కడుపు మాడ్చుకొని!

23-03-2025 12:00:00 AM

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం మలిదశ ఉద్యమంలో కడుపు మడ్చుకొని ఊరూరు తిరిగి ప్రజలను చైతన్యం చేశాం. ఉద్యమ సమయంలో  ఇంటి నుంచి బయటకు వెళ్లామంటే ఎప్పుడు వచ్చేదో తెలిసేది కాదు. ఒక పూట భోజనం చేసి రోజంతా ప్రచారం చేశాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ ఉద్యమం జరిగినా మిత్రులతో కలసి అక్కడికి వెళ్లేవాళ్లం. విద్యార్థి దశ నుంచి సమస్యలపై పోరాటం చేస్తున్నానని చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం బొబ్బిలిగం గ్రామానికి చెందిన మలిదశ ఉద్యమకారుడు బీరయ్యయాదవ్. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం  చేసిన ఉద్యమానుభవాలను వీర తెలంగాణతో పంచుకున్నారిలా.. 

రత్నమ్మ, సంగయ్య దంపతులకు 1967లో బీరయ్యయాదవ్ జన్మించారు. సంగయ్య గ్రామంలో కాంగ్రెస్ నాయకునిగా పనిచేశారు. బీరయ్య యాదవ్ విద్యార్థి దశ నుంచి విద్యార్థుల సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడంతో.. ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఉద్యమంలో పాల్గొని ప్రజలను చైతన్యం చేశారు.  గ్రామాల్లో పర్యటించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. సంగారెడ్డి పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. సింగూర్ ప్రాజెక్టు నీటిని వ్యవసాయ పంటలకు పంపిణీ చేయాలని పోరాటం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డికి మంత్రులు వస్తే అడ్డుకోనే ప్రయత్నం చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసుల ఫలితంగా మూడు నెలలు జైల్లో ఉన్నారు. 

విద్యార్థి దశ నుంచి..

బీరయ్య వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికి పేదల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. విద్యార్థి దశ నుంచి విద్యార్థుల సమస్యలపై పోరాటం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ వసతి గృహంలో నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో చదువుకున్నారు. డిగ్రీ చదువును కొన్ని సమస్యలతో మధ్యలో నిలిపివేశారు. విద్యార్థిగా ఉన్న సమయంలో ఎన్నో పోరాటాలు చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోసం కృషిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ పిలుపు మేరకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని పోరాటం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలో పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు కన్వీనర్‌గా రాత్రి పగలు పని చేసి ప్రజలను చైతన్యపరిచారు.

అన్ని వర్గాలతో కలిసి.. 

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావడంతో ఉద్యమం తీవ్రతరం అయ్యింది. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారు. స్వరాష్ట్రం కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రతి మారుమూల గ్రామాల్లో పర్యంటించి ప్రజలను చైతన్యం చేశాం. విద్యార్థుల నుంచి రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ముందుకు రావడంతో వారితో కలిసి పోరాటం చేశాం. తెలంగాణ ఆవిర్భవించాక ఉద్యమకారులకు పదవులు రాలేదు, గౌవరం దక్కలేదు. కాని ఆత్మగౌవరం కోసం తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నాం.

 గౌని దౌలయ్య, సంగారెడ్డి 

ఆత్మగౌరవం కోసం..

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కడుపు మాడ్చుకొని ఉద్యమాలు చేశాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేశా. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయలను ప్రజలకు వివరించాం. ప్రత్యేక రాష్ట్రం వస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలకు అవగాహన కలిపించినం. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం రోడ్డు నిర్బంధాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేశాం. జాతీయ రహదారులపై వంటావర్పులు చేసి రహదారులను దిగ్బందించాం. నాడు ఎక్కడికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వచ్చినా అడ్డుకున్నాం. మంత్రులను అడ్డుకోనేందుకు వెళ్లేన ప్రతిసారి పోలీసులు అరెస్టు చేసి, కేసులు నమోదు చేసేవారు. ఊరూరా తిరిగి తెలంగాణ ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేశా. ఉద్యమాలు చేస్తే ప్రత్యేక రాష్ట్రం వస్తుందా? అని కొందరు ప్రశ్నంచారు. ప్రశ్నించిన వారే కొన్ని రోజులకు ఉద్యమంలో కలిసి పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించాం.. పోలీసుల దెబ్బలు తిన్నాం.. ఆత్మగౌవరం కోసం పోరాటం చేశాం.

 బీరయ్య యాదవ్, ఉద్యమకారుడు