calender_icon.png 23 December, 2024 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ అస్తిత్వమే తెలుగు సాహిత్యానికి నజరానా

06-10-2024 07:08:37 PM

మునగాల (విజయక్రాంతి): బీసీ అస్తిత్వానికి ఊపిరిలూదుతున్న కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, ఔసుల కుంపటి సహస్రవృత్తుల జీవనగాథలే తెలుగుసాహిత్యానికి అసలైన చిహ్నాలని  తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. శరీరాన్ని కుంపటి  చేసుకుని తన కంఠాన్ని కొలిమిగా మార్చుకుని  సుత్తి, దిమ్మిస, పట్టకారులతో చెక్కిన కళాశిల్పాలే తెలుగు సాహిత్యానికి నజరానాగా ప్రకాశిస్తున్నాయన్నారు. బాణాల శ్రీనివాసరావు రాసిన ’’కుంపటి‘‘ దీర్ఘకవితను ఆదివారం బాణాల పుట్టి పెరిగిన మునగాల మండలం, నారాయణగూడెం (తురకగూడెం)  గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో గ్రామస్తుల సమక్షంలో జూలూరు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకావిష్కరణ సభలు నగరాల కళావేదికల నుంచి పల్లెలు, గ్రామాల ఆవరణల్లోకి తీసుకువెళ్ళే కొత్త సంప్రదాయం కొనసాగడం కవిత్వ మూలాలను బీసీ అస్తిత్వం వైపునకు పయనించడమేనని ఆయన చెప్పారు. ‘‘కుంపటి’’ దీర్ఘకవితను గ్రామస్తుల సమక్షంలో జూలూరు గొంతెత్తి ఆసాంతం చదువుతుంటే గ్రామస్తులు ఉత్కంఠకు, ఆనందానికి, పారవశ్యానికి గురయ్యారు. ఊరు దృశ్యాన్ని 50 ఏళ్ళ క్రితం ఆనాటి సామాజిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు ‘‘కుంపటి’’ కవితలో ఉన్నాయని గ్రామస్తులు చెప్పారు. ఈ కార్యక్రమంలో మునగాల మండల సీనియర్ నాయకులు ఉప్పల యుగంధర్ రెడ్డి, దేవినేని వీరభద్రరావు, నారాయణ గూడెం గ్రామనాయకులు గోపిరెడ్డి కోటిరెడ్డి, నాగిరెడ్డి, సూరగాని రాంబాబు, సోమిరెడ్డి వీరారెడ్డి, కాసాని వీరస్వామి, ప్రతాపరెడ్డి, మిట్టగణపుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.