calender_icon.png 3 October, 2024 | 12:02 PM

ఎక్సైజ్ శాఖ అంటే వణుకు పుట్టాలి

03-10-2024 01:32:55 AM

ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఎక్సైజ్ శాఖ అంటే అక్రమా ర్కుల వెన్నులో వణుకు పుట్టేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు.

సెప్టెంబర్‌లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో పట్టుకున్న మత్తుపదార్థాలు, డ్రగ్స్‌పై నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో బుధవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీగా గంజాయి, డ్రగ్స్ పట్టుకోవడంతో పాటు ఎక్సైజ్ సుంకం చెల్లించని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 

గత నెలలో అధిక కేసులు

సెప్టెంబర్‌లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో ఎక్కువ కేసులు నమోదైనట్లు కమలాసన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అంబర్‌పేట్‌లో 170 కిలోల గంజాయిని పట్టుకోగా, బంజారాహిల్స్, మాదాపూర్‌లోని పబ్బులలో తనిఖీ లు నిర్వహించి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన నలుగురిపై కేసులు నమో దు చేసినట్లు తెలిపారు.

ఇంజినీరింగ్ చదివి డ్రగ్స్ విక్రేతగా మారిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ కేఫ్‌లో ఐస్‌క్రీమ్ తయారీలో విస్కీ కలుపుతుండగా పట్టుకున్నట్లు చెప్పారు. గోవా నుంచి వస్తూ రూ.12 లక్షల విలువైన ఎక్సైజ్ సుంకం చెల్లించని మద్యా న్ని శంషాబాద్‌లో, కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతున్న అక్రమార్కులను పట్టుకున్నామన్నారు. 

గంజాయి దందాకు కళ్లెం

ధూల్‌పేట్‌లో గంజాయి దందాకు కళ్లెం వేశామని కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో నిరంతరం నిఘా పెట్టడంతో ఇది సాధ్యమైందన్నారు. గత నెలలో పసుపు ప్యాకెట్లలో గంజాయిని ప్యాకింగ్ చేసి అమ్ముతున్న వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ధూల్‌పేటకు చెందిన 114 మంది గంజాయి విక్రేతలు జైలులో ఉన్నారని, గత నెలలోనే 43 కేసులలో 134 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు 

సెప్టెంబర్ నెలలో 203 గంజాయి మొక్కలు, 984 కిలోల గంజాయి, 400 గ్రాముల గంజాయి చాక్లెట్లు, 250 గ్రాముల హాష్ ఆయిల్, 11 గ్రాముల ఓపీఎం, 38.44 గ్రాముల ఎండీఎంఏ, 7.30 గ్రాముల ఎల్‌ఎస్‌డీ బ్లాస్ట్స్, 8.44 కిలోల ఆల్ఫాజోలం పట్టుకున్నట్లు కమలాసన్ రెడ్డి తెలిపారు.