బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): క్రీస్తు బోధనలు, కార్యాచరణ ప్రపంచ మానవాళిని ఎంతగానో ప్రభావితం చేశాయని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. క్రీస్తు పుట్టిన రోజును పురస్కరించు కుని రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఏ నేరం చేయని తనను శిలువకెక్కిస్తున్న పాషాణ హృదయులను కూడా క్షమించమని వేడుకున్న మహా త్యాగశీలి, అహింసావాది ఏసుక్రీస్తు అని మంగళ వారం ఒక ప్రకటనలో కొనియాడారు. పాపులను సైతం క్షమించే ఓర్పు, సహనం, దార్శనికత మానవ సమాజానికి క్రీస్తు చూపిన అత్యద్భుతమైన శాంతి మార్గమన్నారు.
విశ్వశాంతి కాంక్షించే పరోపకారులైన ప్రతి ఒకరికీ ఏసు బోధనలు అనుసరణీయమని, ద్వేషంతో నిండిపోతూ రోజురోజుకూ స్వార్థ పూరితమవుతున్న మానవ సంబంధాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు క్రీస్తు కార్యాచరణ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
గంగా జమున సంస్కృతిని పరిఢవిల్లేలా, మత సామరస్యం వెల్లివిరిసేలా సర్వమత సమానత్వాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆచరించి చూపిందని చెప్పారు. పదేళ్ల తమ పాలనలో క్రిస్టియన్ మైనార్టీలకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను దేశానికే ఆదర్శంగా అమలు చేశామని, పలు కానుకలు అందిస్తూ క్రిస్మస్ పర్వదినాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని గుర్తుచేశారు.