09-04-2025 08:34:54 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
మంచిర్యాల (విజయక్రాంతి): 10వ తరగతి పరీక్షల సంబంధిత జవాబు పత్రాల మూల్యాంకనం పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో గల కార్మల్ కాన్వెంట్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాల మూల్యాంకన కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి మూల్యాంకనం ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 10వ తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించాలని, ఎలాంటి పక్షపాతం చూపకూడదని తెలిపారు.
ప్రతి ఒక్కరి జీవితంలో 10వ తరగతి పునాది వంటిదని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా వ్యవహరించాలని తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయాన్ని సందర్శించి ఆర్.డి.ఓ. శ్రీనివాల్రావుతో కలిసి 163జి జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన బాధితుల వివరాలను పరిశీలించారు. మంచిర్యాల-వరంగల్-ఖమ్మం- విజయవాడ జాతీయ రహదారి 163జి నిర్మాణంలో భూములు కోల్పోయిన అర్హులైన ప్రతి ఒక్కరికి పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్బిట్రేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.