- 2024-25 బడ్జెట్ రాబడి అంచనా రూ.2.21 లక్షల కోట్లు
- ఇప్పటివరకు మూడు త్రైమాసికాలు సమాప్తం
- వచ్చిన ఆదాయం రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే..
- 97.81శాతానికి చేరుకున్న అప్పులు
- అంచనాలు దాటిన వడ్డీ, పెన్షన్ చెల్లింపులు
- డిసెంబర్ నివేదికలో కాగ్ కీలక విషయాలు వెల్లడి
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం ఆశించిన మేరకు ఆదాయం రావడం లేదు. బడ్జెట్ అంచనాలకు వాస్తవ రాబడులకు పొంతన ఉండడం లేదు. గురువారం కాగ్ విడుదల చేసిన డిసెంబర్ నివేదిక ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మూడు త్రైమాసికాలు ముగిశాయి. ఇప్పుడు నాలుగో త్రైమాసికం నడుస్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.2.21లక్షల కోట్లుగా అంచనా వేసి, డిసెంబర్ వరకు రూ.1.12 లక్షల కోట్లు మాత్రమే సాధించింది. అంటే 50.76శాతం మాత్రం లక్ష్యాన్ని మాత్రమే చేరుకున్నదన్న మాట. మిగిలిన త్రైమాసికంలో మరో 50 శాతం లక్ష్యాన్ని ఛేదించడం దుర్లభమని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు.
పెరిగిన రెవెన్యూ వ్యయం.. కారణం ఇదే..
వడ్డీలు, పింఛన్లు బడ్జెట్ అంచనాలను మించడంతో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ప్రభుత్వ రెవెన్యూ వ్యయం కాస్త పెరిగింది. ఇంకో త్రైమాసికం ఉండగానే ప్రభుత్వం వడ్డీల చెల్లింపులు బడ్జెట్ అంచనాలను దాటిపోయాయి. ఈ పద్దులో రూ.17,729.77 కోట్లు వడ్డీల కింద చెల్లించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, డిసెంబర్ నాటికే సర్కారు 110.30 శాతం చెల్లించింది. పెన్షన్ చెల్లింపులు 108.11శాతానికి పెరిగాయి.
మూలధన వ్యయాన్ని బడ్జెట్ అంచనాల్లో 75శాతాన్ని ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇదిలా ఉండగా.. కేంద్ర గ్రాంట్లు డిసెంబర్‌లో రూ.242.17 కోట్లు రాష్ట్రానికి అందాయి. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు పెరిగిన నేపథ్యంలో వేతనాల చెల్లింపు కూడా డిసెంబర్‌లో పెరిగింది. గత నెల రూ.3,388.31కోట్లను ప్రభుత్వం వేతనాల రూపంలో చెల్లించగా, ఇది అంచనాల్లో 78.88శాతం కావడం గమనార్హం.
అంతంతమాత్రం రాబడి..
సొంత రాబడుల్లో సేల్స్ ట్యాక్స్ మినహా ఏ విభాగంలో కూడా ఆశించిన మేర ఆదాయం రాలేదు. సేల్స్ ట్యాక్స్ బడ్జెట్ అంచనాల్లో 71శాతం వసూలైంది. గతేడాది ఇదే సమయానికి 56.33శాతం మాత్రమే వసూలు కావడం గమనార్హం. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరైన జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, అబ్కారీ శాఖ మరోసారి ప్రభుత్వాన్ని నిరాశపరిచాయి. ఇదిలా ఉండగా.. డిసెంబర్ నెలలో ప్రభుత్వం రూ.10,328.85 కోట్ల అప్పు తీసుకున్నది. మూడు త్రైమాసికాలు ముగిసే నాటికి అప్పులు 97.81శాతానికి చేరుకోవడం గమనార్హం.