17-03-2025 12:00:00 AM
జీవితమన్నాక ఎన్నో ఒడుదొడుకులు, కాసిన్ని కన్నీళ్లు, ఇంకాస్త కుటుంబం కోసమో లేక సమాజం కోసమో చేసే త్యాగాలూ ఉంటాయి. మానవ జీవితంలోని తాత్వికతను తనలోకి ఒంపుకొని తనదైన భావజాలంతో మనకు విడమర్చి చెప్పడానికి ‘అలా ఆగు కాసేపు’ శీర్షికన కవితా సంపుటిని వెలువరించారు ఏటూరి నాగేంద్రరావు. ఇందులో మొత్తం 75 కవితలు ఉన్నాయి. వాటిలో మనకు సూఫీ, బౌద్ధతత్తాలు ఎక్కువగా కనబడుతాయి. దాదాపుగా అన్ని కవితలూ నిజ జీవితపు అనుభవాలను రంగరించి రాసినట్టుగా ఉన్నాయి.
‘ఎంత బాగుణ్ణు!’ అనే కవితలో ‘మనిషిలో వెన్నుపూసల్ని/ తెంపే స్వార్థం!/ కుళ్లిపోయిన మనసులతో/ మీలోకి మీరే కూరుకుపోయి/ ఎన్నాళ్లుంటారయ్యా!’ అని మనిషి లోపలితనాన్ని ప్రశ్నించారు. ‘అశాశ్వత జీవితానికి ఎందుకు తమను తామే హత్య చేసుకోవడం? గొంగళిపురుగు నుంచి రూపాంతరం చెంది స్వేచ్ఛగా ఎగిరే సీతాకోక చిలుకల వలె మనమంతా నవ్యతను ధరించాలి’ అని కవి అన్నారు మరో కవితలో. స్వచ్ఛమైన మనుషులు చుట్టూ ఉంటే చూడాలని ఉందని కవి ఆశపడతారు. జీవితానికి ఆవలలో ‘నువ్వు తాత్విక గూళ్ళను/ అల్లడం మొదలెట్టాక/ నీకు నువ్వు/ అపరిచితుడివి!/ అగంతకుడివి!’ అంటారాయన.
మనం దైనందిక జీవితంలో ఎన్నో మజిలీలను దాటుకుంటూ వస్తాం. ఆ క్రమంలో ఎన్నో ఒత్తిళ్లను, సంఘర్షణలను, నిరాశా నిస్పృహలను అధిగమించ వలసివస్తుంది. ఈ క్రమంలో ఒక్కోసారి జీవితంపై ఒకింత అసహనానికి గురవుతాం. వీటిని దాటుకొని ముందుకు వచ్చినప్పుడు ఒక తాత్విక స్థితిని చేరుకుంటాం. ఇది మనలో వృద్ధి చెందుతున్నకొద్దీ జనం దృష్టిలో మనమంతా అపరిచి తులుగానే మిగిలిపోతామని వ్యక్తీకరించారు ఏటూరి.
‘ఈ విశాల ప్రపంచంలో నేడు మనుషులు చాలా ఇరుకుగా జీవిస్తున్నారు. కారణా లు అనేకం. కానీ, మనిషిగా బతకడానికి భయపడుతూ తోటి మనుషులకు దూరమవడమే బాధాకరం. ఒక్కోసారి కీర్తిప్రతిష్టలూ గుదిబడ్డలవుతాయి. స్వేచ్ఛకు అడ్డు వస్తాయి’. అందుకే, ‘అద్దె లేని లాడ్జిలాంటి ఆ ఇంట్లో/ మరణాన్ని కొనుక్కోవడానికి కూడా/ పర్మిషన్ కావాలేమో!’ అన్నారు. మరొక చోట ‘ఒక్కోసారి స్వాతంత్య్రం కూడా/ కత్తిలాగా గుచ్చుకుంటది!’ అని ఎంతో సూటిగా చెప్పారు.
ఏ సాహితీపరులకైనా సమాజ శ్రేయస్సే ముఖ్యం. ఫలితంగా, కొంతైనా సమాజంలో మార్పు రాకపోతుందా? అనే ఆశాభావంతోనే కవులు రచనలు చేస్తారు. అలా రాసిన వే ఈ పుస్తకంలోని కవితలన్నీను. ‘ఆఖరి చరణం’ అనే కవితలో ‘బహుశా/ గాయం లేని గతం/ ఉండదేమో!/ ఏ బతుకు సమాధులనూ/ తవ్వకండి!/ గతం నీటి కుండలు/ పగుల్తాయ్’ అని సూచించడంలో లోతైన భావుకత ధ్వనిస్తుంది.
‘ఇప్పుడు మనుషులకు మనసనేదే లేదు/ అది నేడు స్వార్థానికి అమ్ముడు పోతుంది..’ అంటారొక చోట ఘాటుగా. మానవ బంధాలు అడుగంటి పోతున్నాయంటూ, ‘నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలెట్టాక/ మౌనం మనసుతో మాట్లాడుకుంటుంది’, ‘బ్రతుకంతా అర్థం కానీ అబ్‌స్ట్రాక్ట్ చిత్రంలా/ నా చుట్టూ మెరుస్తుంటుంది’ అన్నారు.
జీవితాన్ని ఎంతో లోతుగా పరిశీలిస్తేగాని ఎవరికైనా ఇలాంటి మాటలు రావు. కవి తన జీవితంలో చూసినవి, అనుభవించినవి తనదైన కవిత్వం ద్వారా పాఠకుల హృద యాల్లోకి వెళ్లబోశారు.
అదే విధంగా ‘సమతుల్యం’ అనే కవితలో ‘ఒకవేళ నేను మరణిస్తే/ నన్ను నా సంబంధీకుల సరసన/ ఖననం చేయకండి!/ అక్కడ చచ్చినా/ మనఃశాంతి ఉండదు నాకు’ అని కలుషితమై పోయిన కుటుంబ బంధాలను సూటిగా ఎండగట్టారు. ‘దేశంలో చనిపోతుం ది మనుషులు కాదు, పోరాటానికి ప్రతిబంధకాలైన మనిషి ఆలోచనల కణాలు’ అంటారు ఇంకోచోట.
నిజమే, మరీ గానం చేసేవన్నీ పాటలు కావు. అదే విధంగా రాసేదంతా కవిత్వం కాదు. అందుకే, ‘మన చుట్టూ వుండేవారు మనవారు కాదు’ అనే సత్యాన్ని దీన్ని బట్టి గ్రహించమని చెబుతున్నారు. ‘నా గదిలో ఉన్న ప్రతి వస్తువూ/ నన్ను హెచ్చరిస్తుంటుంది/ ద్వేషం ఎవరికీ ఆనందాన్ని ఇవ్వదని’ (‘జీవనాంతర నాటకం’). నిజమే ద్వేషం మనిషిని అథఃపాతాళానికి తీసుకెళుతుంది.
కానీ, అందుకు విరుద్ధంగా ప్రేమ ఒక్కటే మనలను ఉన్నతులను చేస్తుంది. కనుకే, “మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమను పంచుదాం. బతికి వున్న ఈ నాలుగు దినాలైనా చివరి మజిలీలో ‘పాడె’ మోయడానికి నలుగురి ప్రేమను సంపాదిద్దాం. నలుగురి లో ఒకరమై జీవిస్తూ ఆనందాన్ని పొందు దాం’ అన్న కవి అభిప్రాయంతో పాఠకులు ఏకీభవించాల్సిందే.
ఈ పుస్తకం నిండా ఈ తరహా అనేక నిజ జీవిత అనుభవాలు, అనుభూతుల సమ్మేళన ఛాయలే కనిపిస్తాయి. జీవిత సారాన్ని బోధిస్తున్నట్టు, కళ్ళకు కట్టినట్టుగా చాల చక్కగా నాగేంద్రరావు కవితలల్లారు. మేలైన కవితా సంకలనాన్ని అందించిన ఆయనకు అభినందనలు.
‘అలా ఆగు కాసేపు’, కవిత్వం, రచన: ఏటూరి నాగేంద్రరావు, పేజీలు: 107 పేజీలు. ప్రతులకు: 7416665323ని లేదా ప్రముఖ బుక్ షాప్స్.
రచయితలకు ఆహ్వానం
‘అక్షర’ పేజీ కోసం రచయితలు
వివిధ సాహిత్య ప్రక్రియలపై వ్యాసాలు పంపవచ్చు. కవితలకూ ఆహ్వానం. వ్యాసం నిడివి సుమారు 600 పదాలలోపు ఉండాలి.
సమీక్షకోసం కొత్త పుస్తకాలు
రెండు కాపీలు పంపాలి.
మా చిరునామా: ‘విజయక్రాంతి’ తెలుగు దినప్రతిక, ఇంటర్‌కాంటినెంటల్ పబ్లికేషన్స్ ప్రై.లి., ప్లాట్ నం.1267/ఎ, రోడ్ నం. 63/ఎ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ vk.aksharaa@gmail.com