కళానిధి సత్యనారాయణమూర్తి :
చలనం లేని వస్తువులలో తమోగుణం, చలనశీ లం గల వస్తువులలో రజోగుణం, సత్పురుషులలో సత్త్వగుణం అధికంగా ఉండి, ఇతర రెండు గుణాలు బలహీనంగా ఉంటాయి. ఇతడు ‘సాత్త్వికుడు’ అంటే అతనిలో ‘సత్త్వగుణం’ ప్రబలంగా ఉండి నిర్ణయాత్మక గుణంగా ఉంటుందనే తప్ప ఇతర గుణాలు ఉండవని అనుకోకూడదు. వేరువేరుగా వున్నా అవసరాన్నిబట్టి అవి సహకరిం చుకుంటూనే ఉంటాయి. సత్త్వగుణ సంపన్నుడు ఒక మంచి కార్యాన్ని చెయ్యాలనుకొని తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు రజోగుణ సహకారం కావాలి కదా! దీనర్థం ఏమిటి? గుణాలు సహజ లక్షణాలు కోల్పోకుండా అవసరాన్నిబట్టి అన్యోన్యతా భావాన్ని ప్రదర్శిస్తాయి. ప్రధానమైన గుణం తన ఆధిక్యత ను కోల్పోదు. తన ప్రవృత్తికి అనుగుణంగా ఇతర గుణాల సహకారం స్వీకరిస్తుంది.
‘ప్రకృతి’ అంటే ఆదిమ ద్రవ్యం, (primor dial material) జడమైంది. ‘ఏకమేవ అద్వితీయం’ అనే వేదవాక్కుకు అనుగుణంగా -ఉన్నది ఒకటే గనుక, రెండవది లేదు గనుక, చేతనమైన బ్రహ్మంలోనే ఈ అచేతనమైన ప్రకృతికూడ విడదీయలేని విధంగా కలసి ఉందని ఒక వాదం. దానిని ‘అద్వైతులు’ ఒప్పుకోరు. వారు బ్రహ్మం పూర్తిగా చేతనమైందని, ప్రకృతి దానినుండే పుట్టిందని, అందువల్ల అది బ్రహ్మం కంటే వేరైందని వారి వాదం. ప్రకృతిని ‘మాయ’ అని, ‘ప్రధానం’ అని కూడా పిలుస్తారు. ప్రకృతికి అవ్యక్త స్థితిలో (unmani fested state) నామరూపాలు ఉండవు. కొన్ని ఉపనిష త్తులలో ప్రకృతిని బ్రహ్మం ఉపాధిగా చేసుకుందని చెప్ప డం జరిగింది. అందువల్ల ప్రకృ తి, బ్రహ్మం వేరని అనుకున్నా, ప్రకృతి బ్రహ్మం ఆధీనంలోనే ఉంటుందని చెప్పుకుంటే సమంజసంగా ఉంటుంది.
బీజంలో వృక్షం వలె!
‘ప్రకృతి’ అంటే ‘అచేతన పదార్థం’. సృష్టికి కారణం ఇదే (primordial material cause). ఇది అవ్యక్తంగా ఉన్నప్పుడు సత్వరజస్తమో గుణాలు దీనిలో సామ్యావస్థలో (equilibrium) ఉంటాయి. పురుషులు (ఆత్మలు) ఈ ప్రకృతిలో సంయోగం చెందడమే సృష్టి అని సాంఖ్యులు చెప్పిన మాట. ఈ స్థితిలో గుణాలకి సమతౌల్యం ఉండదు. ఈ ప్రకృతి అవ్యక్త దశలో అతిసూక్ష్మంగా ఉంటుంది. బీజంలో వృక్షం ఎలా నిక్షిప్తమై ఉంటుందో ఈ అవ్యాకృత ప్రకృతిలో నామరూపాలు నిక్షిప్తమై ఉంటాయి. ఇదికూడా నాశరహితమైందే కనుక దీనిని కూడా అక్షరమనే అంటారు. ఇది సృష్టికి మూలమైన హిరణ్యగర్భునకు ఉపాధి. ఈ మూల ప్రకృతి అవ్యక్త దశలో నామరూపాలకు అతీతంగా ఉంటుంది గనుక పరము (లేక పరాప్రకృతి) అంటారు. వ్యక్తమైనప్పుడు అంటే విశ్వం ఆవిర్భవించినప్పుడు దానిలోని అచేతన పదార్థాన్ని ‘అపరాప్రకృతి’ అంటారు.
ప్రకృతికి సంబంధించి ‘గుణం’ అంటే మనం సామాన్యంగా వస్తువులకు ఆపాదించే గుణం (quality) అని అనుకోకూడదు. సాంఖ్యం ప్రకృతికి, దాని గుణాలకు భేదాన్ని ఒప్పుకోదు. ఈ త్రిగుణాలు ప్రకృతి స్వభావాలు, ప్రకృతికంటె వేరుకాదు. వస్తువుకు గుణానికి మధ్య బేధాన్ని సాంఖ్యం ఒప్పుకోదు. మనం ప్రపంచంలో అనేక వస్తువులను చూస్తుంటాం. ఆ వస్తువులన్నింటికీ ఒక మూల ద్రవ్యం లేక పదార్థం ఉండాలి కదా! అదే ప్రకృతి. ఏది చక్కగా కార్యసాధనకు ఉపయోగపడుతుందో అదే ప్రకృతి. పరి ణామ శీలం గలది గనక ప్రకృతి అని, జడం గనుక అవిద్యయని, అనేక రూపాలు ధరిస్తుంది గనుక మాయ అని దీన్ని భాష్యకా రులు అభివర్ణించారు. అదొక దృగ్గోచరమైన పదార్థం గాని, వ్యక్తిగాని కాదు. కారణరూపమైన శక్తి. అది అనుమాన ప్రమాణంతోనే నిరూపితమవుతుంది. దానినుండి కార్యరూపమైన జగత్తు వ్యక్తమవుతుంది గనుక మన కంటికి కనిపించే భిన్న రూపాలుగల వస్తువులన్నీ ప్రకృతి భిన్నరూపాలే. దీన్నిబట్టి మనకు తెలిసేది కార్యం కారణంలోనే ఉంది, ఈ కార్యం కారణంలోనే లయం అవుతుంది అని.
భగవద్గీతలో ‘ఓ అర్జునా! మూల ప్రకృతి విశ్వానికి మూలకారణం. దానిలో చేతన సముదాయమైన జీవజాలాన్ని బీజరూపం లో ఉంచుతాను. ఇలా జడచేతన సంయోగంతో, జడచేతన రూపమైన విశ్వం ఉత్పన్న మవుతుంది’ అని పరమాత్మ స్వయంగా చెప్పాడు (భ.గీ. 14.3).
పరమేశ్వరుడు త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని ఆధారంగా చేసుకుని తన వీక్షణమాత్ర సంకల్పంతో సృష్టికార్యం చేస్తున్నాడని భగవద్రామానుజులు అన్నారు. మూల ప్రకృతిలో ఇరువది నాలుగు తత్త్వాలు ఉంటాయని, విశ్వంలోని వస్తుజాలం అంతా జడప్రకృతి నుండి పుట్టిందే అని ద్వైతం చెప్పింది. ఇలా ప్రకృతిమీద విశ్లేషణ భారతీయ తత్త్వశాస్త్రంలో విశేషంగా జరిగింది.
‘శ్రీ వేదభారతి’ సౌజన్యంతో..
‘వేదాంత పరిభాష’ నుంచి..