calender_icon.png 11 October, 2024 | 5:58 AM

శకం ముగిసింది

11-10-2024 01:35:54 AM

టెన్నిస్‌లో మట్టి కోట మారాజుగా పేరు పొందిన స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఓపెన్ శకంలో అత్యధిక టైటిల్స్ సాధించిన రెండో ఆటగాడిగా నాదల్ రికార్డులకెక్కాడు. 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించిన స్పెయిన్ వీరుడికి అల్విదా.

టెన్నిస్‌కు రఫేల్ నాదల్ గుడ్ బై 

డేవిస్ కప్‌లో చివరి మ్యాచ్ ఆడనున్న స్పెయిన్ బుల్

మాడ్రిడ్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ గురువారం టెన్నిస్ ఆటకు వీడ్కోలు పలికాడు. కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమవుతున్న నాదల్ తన రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు ‘ఎక్స్’ వేదికగా భావోద్వేగ ప్రకటన చేశాడు. 38 ఏళ్ల నాదల్ 2001లో ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడలో అడుగుపెట్టాడు.

టెన్నిస్ ఓపెన్ శకంలో 23 ఏళ్ల పాటు ఎదురులేకుండా సాగిన నాదల్ కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కెరీర్ గ్రాండ్‌స్లామ్ అందుకున్న నాదల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడం ద్వారా కెరీర్ గోల్డెన్ గ్రాండ్‌స్లామ్‌ను కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక నాదల్ కెరీర్‌లో 92 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్‌తో పాటు 36 మాస్టర్స్ టైటిల్స్ ఉన్నాయి.

2008లో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న నాదల్ 2013 ఏడాదిలో 14 టోర్నీల్లో ఫైనల్స్ చేరి అందులో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పాటు ఐదు మాస్టర్స్ టైటిల్స్ నెగ్గి సమ్మర్ స్లామ్ పూర్తి చేశాడు.

ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ఆటగాడిగా నాదల్ (22) రెండో స్థానంలో ఉండగా.. అతని కంటే ముందు నొవాక్ జొకోవిచ్ (24 టైటిళ్లు) తొలి స్థానంలో ఉన్నాడు. రోజర్ ఫెదరర్ (20 టైటిల్స్) మూడో స్థానంలో ఉన్నాడు. వచ్చే నెలలో జరగనున్న డేవిస్ కప్ తన చివరి మ్యాచ్ కానుందని నాదల్ స్పష్టం చేశాడు.

మట్టికోట రారాజు..

నాదల్ తన కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ నెగ్గితే అందులో 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గడం విశేషం. క్లే కోర్టు (ఎర్రమట్టి)పై 63 టైటిల్స్ సాధించిన నాదల్ ఒక దశలో 81 మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఎర్రమట్టిపై నాదల్ ఆధిపత్యం ఎంతలా సాగిందనడానికి ఈ రికార్డు ఒక నిదర్శనం.

ఇక బిగ్ త్రీగా పిలవబడే నాదల్, ఫెదరర్, జొకోవిచ్‌ల మధ్య పోటీ రసవత్తరంగా ఉండేది. జొకోవిచ్‌తో 60 సార్లు తలపడిన నాదల్ 29 విజయాలు.. 31 ఓటములు చవిచూశాడు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో మాత్రం నాదల్ 6 జొకోపై పై చేయి సాధించాడు. ఇక చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌తో 40 సార్లు తలపడిన నాదల్ 24 సార్లు గెలిచి 16 సార్లు ఓడాడు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ 6-3తో నాదల్‌దే పైచేయి.

నాదల్ సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్: 

ఫ్రెంచ్ ఓపెన్: 14 సార్లు

యూఎస్ ఓపెన్: నాలుగు సార్లు

ఆస్ట్రేలియన్ ఓపెన్: రెండు సార్లు

వింబుల్డన్: రెండు సార్లు