వనపర్తి (విజయక్రాంతి): నవంబర్ 6 నుండి ఎన్యుమరెటర్ బ్లాక్ వారీగా కుటుంబాల జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ ఛాంబర్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సాయంత్రం వరకు ప్రతి ఎన్యుమరేటర్ కు ఉత్తర్వు కాపీ అందాలని, ఇంకా ఎవరైనా శిక్షణ పొందని ఎన్యుమరెటర్లు ఉంటే తక్షణమే శిక్షణ ఇవ్వాలని జిల్లా ప్రణాళిక అధికారిని ఆదేశించారు. నవంబర్ 9 నుండి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభం కానున్నందున నవంబర్ 6 నుండి 8 వ తేది లోపు బ్లాక్ లలో కుటుంబాల జాబితా సిద్ధం చేసి ప్రతి ఇంటి పై సమాచార స్టిక్కర్ ను అతికించాలని సూచించారు.
ప్రతి ఎన్యుమరేటర్ కు వారు సర్వే చేయాల్సిన ఎన్యుమరేటర్ బ్లాక్ పరిధిని చూపించాల్సిన బాధ్యత గ్రామీణ ప్రాంతంలో అయితే పంచాయతీ సెక్రెటరీ, మున్సిపాలిటీలలో అయితే వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, జవాన్ లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. సర్వేకు అవసరమైన మెటీరియల్ వెంటనే అందరూ ఎన్యుమరెటర్లకు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, సిపిఓ భూపాల్ రెడ్డి, ఏవో కలెక్టరేట్ భాను ప్రకాష్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ, తహసిల్దార్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.