- బీసీలు ఎలా తగ్గారు.. ఓసీలు ఎలా పెరిగారు?
- ఈ లెక్కలతో ఏం చేయబోతున్నారు?
- మండలిలో ప్రశ్నించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే డేటాతో ఏం చేయబోతున్నారో చెప్పాలని బీఆర్‌ఎస్ సభ్యులు ప్రశ్నించారు. బీసీల జనాభా ఎలా తగ్గింది.. ఓసీల జనాభా ఏవిధంగా పెరిగిందో.. చెప్పాలని శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కవిత, సత్యవతి రాథో డ్, ఎల్.రమణ, బండా ప్రకాశ్ తమ ప్రసంగాల్లో డిమాండ్ చేశారు.
కులగణనపై సమగ్ర చర్చ జరగాలని, ఒక్క రోజు లో చర్చ సాధ్యంకాదన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా కులగణన సర్వే నివేదిక ఉందన్నారు. కులగణనపై బీసీలు ఆశలు పెట్టుకున్నారని, కానీ, సర్వే తప్పుల తడకగా ఉందని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వేను ఒక పండుగలా నిర్వహించిందని, విదేశాల నుంచి కూడా వచ్చి సర్వేలో పాల్గొన్నారని తెలిపారు.
క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు రోజుల కిందట చెప్పిన కులగణన వివరాలనే ఇప్పుడు శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటించారని ఎద్దేవా చేశా రు. ఈ కులగణన వివరాలతో స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పడంలేదన్నారు.
వాకౌట్ చేయని కవిత..
ఇదిలా ఉంటే శాసనమండలిలో కులగణన సర్వే నివేదికను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చదివి వినిపించారు. దీనిపై చర్చ జరిగిన అనంతరం ఆమో దం తెలిపే క్రమంలో ప్రభుత్వ తీరుపై మండలి నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్ చేస్తున్నట్లు మండలి ప్రతిపక్షనేత మధుసూద నాచారి ప్రకటించారు. అయితే మండలి నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలందరూ వాకౌట్ చేస్తూ సభ నుంచి బయటకు వెళ్లిపోగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మాత్రం వాకౌట్ చేయకుండా సభలోనే కూర్చుండిపోవడం గమనార్హం.
కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ కుటుంబ సర్వేలో పాల్గొనని వారు ఇంకా ఉన్నారని, లెక్క ల్లో వ్యత్యాసం ఉండటంతో మరోసారి కొన్ని ప్రాంతాల్లో శాంపిల్ రీవెరిఫికేషన్ చేయాలని కోరారు. కులగణన సర్వేను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి కూడా సర్వేపై ప్రసంగించారు.