calender_icon.png 20 November, 2024 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెయ్యి రోజులైనా..

20-11-2024 01:01:39 AM

రష్యా ఉక్రెయిన్ మధ్య   ఆగని యుద్ధం 

అడుగడుగునా రక్తపాతం

ప్రజల అష్టకష్టాలు

మాస్కో/ కీవ్, నవంబర్ 19: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో జరిగిన అతిపెద్ద రణంగా నిలిచిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం మంగళవారంతో వెయ్యి రోజులకు చేరుకున్నది. 2022 ఫిబ్రవరి 24న మాస్కో దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో చేపట్టిన సైనిక చర్య ఇంతటి వినాశానికి దారి తీసింది. రెండు దేశాల మధ్య క్షిపణుల దాడులు వేలాది ప్రాణాలు తీశాయి. రెండు దేశాల్లోని పలు నగరాలు, పల్లెలు చిద్రమయ్యాయి.

యుద్ధం మిగిల్చిన విషాదం..

వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. రెండు దేశాల మధ్య యుద్ధంలో సుమారు 80,000 మంది ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 4 లక్షల మంది గాయాల పాలయ్యారు. అలాగే రష్యాకు చెందిన 2 లక్షల మంది సైనికులు మృత్యువాతపడ్డారు. మరో 4 లక్షల మంది గాయాల పాలయ్యారు. ఐరాస మానవ హక్కుల మిషన్ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి కీవ్ ప్రాంతంలో 11 వేల మందికి పైగా మృతిచెందారు.

ఇతర సంస్థల గణాంకాల ప్రకారం.. యుద్ధకాలంలో ఉక్రెయిన్‌కు చెందిన 589 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధంతో ఆ దేశంలో జననాల రేటు మూడో వంతు పడిపోయింది. సుదీర్ఘ కాలం యుద్ధంతో ఆ దేశం 152 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ పతనావస్థకు చేరుకున్నాయి. ఉక్రెయిన్ పునః నిర్మాణానికి 486 బిలియన్ డాలర్లు అవసరమని ప్రపంచ బ్యాంక్ అంచనా. దీన్నిబట్టి యుద్ధంలో ఆ దేశం ఎంత నష్టపోయిందో అంచనా వేయవచ్చు.

రష్యాలోకి దూసుకెళ్లిన అమెరికన్ క్షిపణులు

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నది. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కానీ, ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. దీనిలో భాగంగానే ఉక్రెయిన్ తాజాగా అమెరికా తయారు చేసిన ఆరు ఆర్మీ టాక్టికల్ క్షిపణులను తమ దేశంలోని బ్రయాన్క్స్ ప్రాంతంలో ప్రయోగించిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

క్షిపణులను తమ ఆర్మీ కూల్చివేసిందని, ప్రాణనష్టమేమీ జరగలేదని స్పష్టం చేసింది. తాము అందించిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపై దాడికి వినియోగించుకునేందుకు ఉక్రెయిన్‌కు అనుమతులు ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడన్ ప్రకటించిన కొద్దిరోజుల్లో దాడులు జరగడం గమనార్హం.