09-04-2025 01:16:07 AM
సమస్యల పరిష్కారంలో చొరవలేదని రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి
డిమాండ్లపై ఉద్యోగుల జేఏసీ నేతృత్వంలో
ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేత
12న ఉద్యోగుల జేఏసీతో క్యాబినెట్ సబ్‌కమిటీ భేటీ
హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద హారు నెలలవుతున్నా ఒక్క డీఏ మిన హా ఎలాంటి దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించలేదని రాష్ట్ర ప్రభు త్వ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదిగో.. ఇదిగో అంటూ కాలం వెల్లబుచ్చుతున్నారే తప్ప చెప్పుకోదగ్గ సమస్యలను ఏమాత్రం పరిష్కరించలేదని ఆరోపిస్తున్నారు.
సమస్యల పరి ష్కారంపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కరువైందని ఉద్యోగు ల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఐదారు నెలల కిందట ఉద్యోగ సంఘాలతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆర్థికేతర సమస్యలను మార్చిలోపు పరిష్కరిస్తామని, ఆర్థిక సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఇందుకు అనుగుణంగా ఉద్యోగుల సమస్యలపై అధ్యయనం చేసి, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. అయితే ఏప్రిల్ వచ్చినా పెండింగ్ సమస్యలన్నీ అలాగే ఉండటం, బిల్లుల విషయంలో కాలయాపన వంటి అంశాలపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ లాంటివి కూడా హైకోర్టుకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు.
మంత్రులకు వినతిపత్రాలు అందజేత
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలపై జిల్లాల్లోని నేతలు, ఉద్యోగులు తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకో వాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీని వాసరావు దశలవారీ ఉద్యమ కార్యాచరణను గతంలో ప్రకటించారు.
ఈనేపథ్యంలోనే మంగళవారం రాష్ట్ర, జిల్లాస్థాయిలో మంత్రులు, ప్రజాప్రతినిధులకు సమస్యల పరిష్కారం కోరుతూ వారికి వినతిపత్రాలు అందజేశారు. హైదరాబాద్‌లో మంత్రులు పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు జేఏసీ నేతలు వినతిపత్రాలు సమర్పించారు. అదేవిధంగా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లకూ వినతిపత్రాలు అందజేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.
క్యాబినెట్ సబ్‌కమిటీపైనే ఆశలు..
ఈనెల 12న(శనివారం) తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో క్యాబినెట్ సబ్‌కమిటీ భేటీపైనే ఉద్యోగులు ఆశలుపెట్టుకున్నారు. దీర్ఘకాలికంగా 57 అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 34 వరకు ఎటువంటి ఆర్థికపరమైన అంశాలు లేకుండానే పరిష్కరించదగ్గవి ఉన్నాయి.
డీఏలు, పెండింగ్ బిల్లులు, పీఆర్సీతోపాటు ఇతరత్రా ప్రధాన అంశాలను పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈ భేటీ ఉద్యోగ సంఘాల నేతల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకుంటే ఇప్పటికే ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను యథావిధిగా కొనసాగించే యోచనలో ఉన్నారు.
మంత్రివర్గ ఉపసంఘం ఏమేరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తుందనేది ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క నేతృత్వంలో జరిగే ఈ భేటీకి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కే కేశవ రావు సభ్యులుగా హాజరుకానున్నారు. గతంలో ఈ ఉపసంఘం సమావేశమైనా ఒక డీఏ మినహా ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదని పలువురు జేఏసీ నేతలు చెబుతున్నారు.