10-12-2024 02:12:41 AM
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): నాలుగు కోట్ల తెలంగాణ బిడ్డల భావోద్వేగమే తెలంగాణ తల్లి విగ్రహమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివర్ణించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నాడు సోనియాగాంధీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకున్నారని.. తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్ 9న ప్రకటించారని గుర్తుచేశారు.
తెలంగాణకు ఈరోజు పర్వదినమని పేర్కొన్నారు. సోమవారం శాసనసభ శీతాకాల సమావేశాల్లో సీఎం మాట్లాడారు. అధికారికంగా ఇప్పటివరకు తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రకటించలేదని, ప్రజల ఆకాంక్షలు గౌరవించలేదని అన్నారు. ఆరు దశాబ్దాలుగా రకరకాల రూపాల్లో ప్రత్యేక రాష్ర్ట ఆకాంక్షను తెలంగాణ ప్రజలు తెలియజేశారని.. రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారని తెలిపారు.
‘ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యమ సందర్భంలో యువత గుండెలపై రాసుకున్న టీజీ అక్షరాలను వాహనాలకు పెట్టుకున్నాం. ఉద్యమ కాలంలో స్ఫూర్తిని నింపిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ర్ట గీతంగా ప్రకటించుకున్నాం. ఇప్పటివరకు అధికారికంగా తెలంగాణ తల్లి రూపాన్ని ఆమోదించకపోవడం దురదృష్టకరం.
తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వజ్ర వైఢూర్యాలతో, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా? తల్లిలా ఉండాలా? అని ప్రస్తావన వచ్చినప్పుడు.. తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు సూచించారు’ అని సీఎం వెల్లడించారు. తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసినట్టే అనిపించేలా బహుజనుల తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నట్టు తెలిపారు.
దురదృష్టవశాత్తు కొంతమందికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠాపన నచ్చలేదని అన్నారు. ఒక వ్యక్తి, ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ సమాజం ఆలోచన అనుకోవడం తప్పని పేర్కొన్నారు. మధ్య యుగ చక్రవర్తుల పాలనలా చేస్తామంటే ఇప్పుడు నడవదని స్పష్టంచేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతోందని తెలిపారు.
తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన వేళ ఈ ఒక్కరోజు తెలంగాణ సమాజం కోసం సమయం ఇద్దామని, ఈరోజు ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకొందామని పిలుపునిచ్చారు.
తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనలో సంప్రదాయాలు, సంస్కృతులను పరిగణలోకి తీసుకున్నామని, ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో తీర్చిదిద్దామని తెలిపారు. గుండుపూసలు, హారం, ముక్కుపుడకను పొందుపర్చామని చెప్పారు.
ఆకుపచ్చ చీర, కడియాలు, మెట్టెలతోపాటు చాకలి ఐలమ్మ, సమ్మక్కసారక్క పోరాట స్ఫూర్తితో తెలంగాణ తల్లి రూపకల్పన చేశామని స్పష్టంచేశారు. సంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్నలు ఆ తల్లి చేతిలో కనిపించేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
బీఆర్‌ఎస్ నేతలకు అధికారంపైనే యావ: భట్టి
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయం చెప్పకుండా బయట ఉండటాన్ని చూస్తే వారికి అధికారంపైనే తాపత్రయం ఉందన్న అభిప్రాయం కలుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం సభలో చేసిన ప్రకటనపై భట్టి మాట్లాడారు. సభలో ఒకసారి ప్రకటన చేసిన తర్వాత దానిపై సహజంగా చర్చే ఉండదు.
కానీ, అందుకు భిన్నంగా కొత్త సంప్రదాయానికి తెరలేపుతూ చేసిన ప్రకటనపై సభ్యులందరూ తమ అభిప్రాయా లు చెప్పాలని కోరినా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభకు దూరంగా ఉండటం చూస్తే వారికి తెలంగాణపై, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రేమ లేదని సభ్యులంతా భావిస్తున్నారని తెలిపారు.
సభ్యులు సభలో ఉండి తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీని, ఆమె నిర్ణయాన్ని, తెలంగాణ అమరుల కలలు నిజం చేసిన ప్రకటనకు ఏకగ్రీవంగా కృతజ్ఞతలు చెప్పాల్సి ఉందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని రాష్ర్టమంతా పండుగలా జరుపుకొంటుంటే తమకు అవసరం లేదని బీఆర్‌ఎస్ నేతలు బయటికివెళ్లి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.
శాసనమండలిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై తాను ప్రకటన చేస్తే సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని.. హర్షం వ్యక్తంచేశారని తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావు సభలో ఉండి అభిప్రాయాలు చెప్తే బాగుండేదన్నారు. వారు మమ్మల్ని పొగడాలని, తెలంగాణ తల్లి విగ్రహం గొప్పగా ఉందని చెప్పాలని కోరుకోవడం లేదన్నారు.
భిన్నాభిప్రాయాలు ఉన్న ఉమ్మడి రాష్ర్టం లో సభను నడిపామని, తెలంగాణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు తాను డిప్యూటీ స్పీకర్‌గా, శ్రీధర్ బాబు శాసనసభ పక్ష వ్యవహారాల మంత్రిగా అందరికీ అవకాశం ఇచ్చామని గుర్తుచేశారు.
తెలంగాణ తల్లి ఉత్సవాల ను డిసెంబర్ 9న అధికారికంగా నిర్వహించాలని, ఏటా నిర్వహిస్తామని ఇది మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆగస్టు 15, జనవరి 26 పండగల్లానే డిసెంబర్ 9న కూడా అధికారిక నిర్వహణకు గెజిట్ విడుదల చేసి అధికారిక లాంచనాలు పూర్తి చేస్తామన్నారు.