మంథని అంబేడ్కర్ చౌరస్తాలో ఫ్లకార్డులతో నిరసనలో న్యాయవాది రఘోత్తమ రెడ్డి
మంథని (విజయక్రాంతి): క్యూబా దేశంపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలని సిఐటియు అఖిల భారత కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం మంథని అంబేడ్కర్ చౌరస్తాలో ఫ్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కమ్యూనిస్టు నాయకుడు, ప్రముఖ న్యాయవాది కె.రఘోత్తమ రెడ్డి మాట్లాడుతూ.. క్యూబాపై అమెరికా అనేక సంవత్సరాలుగా నిర్బంధాన్ని, ఆంక్షలను విధిస్తూ ఆర్థికంగా, వాణిజ్యపరంగా క్యూబా దేశాన్ని దెబ్బతీస్తుందని, దీనివలన క్యూబా ప్రజానీకం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా క్యూబాకు సంఘీభావంగా ప్రతి ఒక్కరు నిలబడాలని కోరారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరుగుతున్న తరుణంలో క్యూబాపై అమెరికా సామ్రాజ్యవాదం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమితిలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్, నాయకులు ఆర్ల సందీప్, వేల్పుల సురేష్, బావు రవి, మంథని లింగయ్య, ఇరుగురాల ప్రసాద్, హమాలీ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.