calender_icon.png 8 January, 2025 | 10:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోగిన ఎన్నికల నగారా

08-01-2025 01:22:02 AM

  1. ఢిల్లీ అసెంబ్లీ స్థానాలకు షెడ్యూల్ ప్రకటన
  2. ఫిబ్రవరి 5న పోలింగ్, 8న ఫలితాలు
  3. ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.55కోట్ల ఓటర్లు
  4. ఈవీఎంలపై ఆరోపణలు కొట్టేసిన రాజీవ్ కుమార్
  5. పోలింగ్ శాతం మార్పుపైనా వివరణ
  6. గెలుపుపై ప్రధాన పార్టీల్లో ధీమా

న్యూఢిల్లీ, జనవరి 7: ఢిల్లీ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) మంగళవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలిపింది. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెలువడుతాయని పేర్కొంది.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ ప్లీనరీ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరి 10న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవుతుంది. జనవరి 17న నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఈనెల 18న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.

20వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ గుడువు ముగుస్తుంది. ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికల్లో మొత్తం 1.55కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోబుతున్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఇందులో 83.49లక్షల మంది పురుష ఓటర్లు ఉండగా.. 71.74లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నట్టు వెల్లడించారు.

ఈసారి ఎన్నికల్లో 2.08లక్షల మంది యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల కోసం మొత్తం  13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అన్ని కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను అందుబాటులో ఉంచనున్నట్టు వెల్లడించారు.

అలాగే 85ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగుల కోసం ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయాన్ని కల్పించనున్నట్టు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

మరో రెండు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు

ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిన ఈసీ.. ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్, తమిళనాడులోని ఈరోడ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఢిల్లీతోపాటే ఈ రెండు స్థానాల్లో ఫిబ్రవరి 5న ఉప ఎన్నికలు  నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలతోపాటే ఈ రెండు ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను కూడా వచ్చే నెల 8న వెలువడుతాయని స్పష్టం చేసింది.

కాగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ నుంచి మిల్కీపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన అవధేష్ ప్రసాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో మిల్కీపూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అలాగే ఈరోడ్  నియోజవర్గం ఎమ్మెల్యే ఇళంగోవన్ గత నెల 14న అనారోగ్యంతో మరణించారు. ఈ క్రమంలో రెండు స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. 

గెలుపుపై ఆప్ ధీమా

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ కార్యకర్తలకు ఎక్స్ వేదికగా దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలందరూ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల నిబద్ధత ముందు ఎంత పెద్ద వ్యవస్థ అయినా విఫలం కావాల్సిందేన్నారు. కార్యకర్తలే ఆప్‌కు బలమని పేర్కొన్నారు. అంతేకాకుండా అభివృద్ధికి, అధికార దుర్వినియోగానికి జరుగుతున్న ఎన్నికల్లో తాము తప్పుకుండా విజయం సాధిస్తామని పేర్కొన్నారు. 

స్వాగతించిన బీజేపీ

ఎన్నికల షెడ్యూల్‌ను బీజేపీ స్వాగతిస్తున్నట్టు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా పేర్కొన్నారు. ఢిల్లీని అభివృద్ధి పథంలో నడిపించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. ప్రధాని నరేంద్రమోదీ మార్గదర్శకత్వంలో ఢిల్లీ సర్వతోము ఖాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. 

ఆరోపణలు కొట్టిపారేసిన సీఈసీ

ఈవీఎంల విషయంలో ప్రతిపక్షాa ఆరోపణలను సీఈసీ రాజీవ్ కుమార్ ఖ ండించారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి అవకాశంలేదని, ఓటింగ్ మెషిన్లను హ్యాక్ చేయడం, వాటి ద్వారా రిగ్గింగ్ చే యడం అసాధ్యమన్నారు. సు ప్రీం ఆదేశాలను అనుసరించి 2019 నుంచి ఈవీఎం లు వెల్లడించిన ఫలితాలను వీవీప్యాట్‌లోని స్లిప్పుల ద్వారా పోల్చి చూస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రతి ఎన్నికల్లో ర్యాండమ్‌గా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను ఎన్నుకుంటూ ఈవీఎంలలో వెల్లడించిన ఫలి తాలను వీవీప్యాట్‌లోని స్లిప్పుల ద్వారా పోల్చి చూస్తున్నట్టు చెప్పారు. అలా ఇప్ప టి వరకు 4.5కోట్ల ఓట్లను పరిశీలించినట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎక్కడా కూడా ఎలాంటి వ్యత్యాసాలను గమనించలేదన్నారు. తిరిగి బ్యాలెట్ విధానంలోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈవీఎంలను హ్యాక్ చేసే అవకాశం లేదన్నారు. ఓటర్ లిస్ట్‌లో అవకతవకలపై వచ్చిన ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. ఓటరు జాబితాలో మార్పుల విషయం లో ఎన్నికల సంఘం కఠినమైన నిబంధనలను పాటిస్తుందని చెప్పారు. ఎన్నికల విధానంలో ఈసీ ఎప్పుడూ పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

పోలింగ్ శాతంలో భారీ మార్పు లు ఉంటున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై రాజీవ్ కుమార్ మాట్లాడారు.  సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా ఓటర్లు క్యూలైన్‌లలో ఉంటున్నారన్న విషయాన్ని గుర్తుచేశారు. క్యూలైన్‌లో నిల్చు న్న వారి సంఖ్యను పరిగణలోకి తీసుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో పోలింగ్ శాతంలో మార్పు రావడం సహజమన్నారు.

ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్

* ఎన్నికల నోటిఫికేషన్ విడుదల: జనవరి 10

* నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: జనవరి 17

* నామినేషన్ల పరిశీలన: జనవరి 18

* నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: జనవరి 20

* పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 5

* ఓట్ల లెక్కింపు: ఫిబ్రవరి 8

పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య

ఆమ్‌ఆద్మీ: 70

బీజేపీ: 29

కాంగ్రెస్: 48