calender_icon.png 28 November, 2024 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలాలను మింగేసిన భూ బకాసురులు

27-08-2024 01:09:57 AM

అక్రమంగా పెట్రోల్ బంకులు, ఇళ్ల నిర్మాణం

పట్టించుకోని పాలకులు, అధికారులు

గజ్వేల్, ఆగస్టు 26: గజ్వేల్ చుట్టు పక్కల గల నాలాలను భూ బకాసురులు మింగేశా రు. నాలాలను పూడ్చి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. చెరువుల్లోకి వరద నీటిని చేర్చే నాలాలు కనుమరుగవుతన్నా అధికారులు, పాలకుటు పట్టించుకోవడం లేదు. గజ్వేల్ పాండవుల చెరువులోకి వరద నీటిని తీసుకువచ్చే నాలాలను రియల్టర్లు కబ్జా చేసి భవనాలు, ఇతర కట్టడాలు నిర్మించారు. గజ్వేల్ పరిధిలోని ఎర్రకుంట నుంచి పాండవుల చెరువులోకి గొలుసుకట్టుగా వరదనీరు చేరేది.

తొమ్మిది అడుగుల వెడల్పు తో ఉండే ఆ నాలా.. కబ్జాల అనంతరం మూడు అడుగులకు తగ్గింది. కొన్ని చోట్ల పూర్తిగా నాలాను పూడ్చివేయడంతో ఆనవా లు లేకుండా పోయింది. దీంతో వరద నీరు పాండవుల చెరువులోకి వెళ్లకుండా ఇళ్లల్లోకి వచ్చి చేరుతున్నది. గజ్వేల్ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో పాండవుల చెరువు పక్కన కార్యాలయ నిర్మాణానికి అర ఎకరం స్థలాన్ని ఒక దాత దానం చేశారు. ఆ భూమి ఎఫ్‌టీఎల్ పరిధిలోకి రావడంతో నిర్మాణాన్ని విరమించుకున్నారు. అయితే దాత వారసులు ఆ భూమిని తిరిగి పొందడానికి గతంలో బదీలీపై వెళ్లిన మున్సిపల్ కమిషనర్‌కు రూ.10లక్షలకు పైగానే ముట్టజెప్పినట్టు తెలుస్తున్నది. 

శిఖం భూముల్లో ప్లాట్లు, వెంచర్లు

గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు తో పాటు ఎర్రకుంట నాలా భూములు, ప్రజ్ఞాపూర్ ఊరచెరువు నాలా భూములు, ముట్రాజ్‌పల్లి సమీపంలోని పిన్నకుంట, బర్రిచెరువు, మొండికుంట శిఖం, ఎఫ్‌టీఎల్ భూములు కబ్జాకు గురయ్యాయి. వాటిలో భారీగా వెంచర్లు ఏర్పాటు చేసి, ప్లాట్లను విక్రయిస్తున్నారు. ప్రజ్ఞాపూర్ ఊరచెరువు ఎఫ్‌టీ ఎల్‌లో ఇళ్లను నిర్మించడంతో వానాకాలం లో చెరువు నిండి మత్తడి దూకితే ఇళ్లల్లోకే నీరు వచ్చి చేరుతున్నది.

వరదనీరు చేరినప్పుడల్లా మాత్రమే అధికారులు సహాయక చర్యలు చేపట్టడం తప్ప శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు. నాలా మీదుగా ఉన్న ప్రజ్ఞాపూర్ బ్రిడ్జి సమీపం లో కూడా ఇండ్ల నిర్మాణాలకు మున్సిపాలిటీ అనుమతిలివ్వడం గమనార్హం. దీనికి సమీపంలోనే గత రెండేండ్ల క్రితం భారీ వర్షాలతో భూమి క్రుంగి ఒక భవనమే నేలమట్టం అయ్యింది.