పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి): భవిష్యత్ తరాల మనుగడుకు ఇబ్బంది కలగకుండా భూమిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణ దిశగా ప్రభుత్వానికి సహకరిస్తూ విధిగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాలుష్యంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతి ఏటా జాతీయ కాలుష్య నియంత్రణ దినాన్ని జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది “స్వచ్ఛమైన గాలి, పచ్చని భూమి -సుస్థిరమైన జీవనం వైపు అడుగు” అనే నేపథ్యంతో కాలుష్య నియంత్రణ దినాన్ని టీజీపీసీబీ నిర్వహిస్తున్నదని తెలిపారు.
పెరుగుతున్న వాయు కాలుష్యంపై అవగాహన కల్పించడం, పారిశ్రామిక విపత్తుల నియంత్రణ, పారిశ్రామిక కాలుష్యాన్ని నివారించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరు పర్యావరణ అనుకూల వస్తువులను వాడటంతోపాటు, మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమవంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాచరణకు తోడుగా ప్రజలు ఉద్యమిస్తేనే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.