calender_icon.png 26 November, 2024 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూమి అక్షం కుంగింది!

26-11-2024 01:49:04 AM

  1. అవసరానికి మించి భూగర్భజలాల వాడకంతో ముప్పు
  2. భూభ్రమణంపై ప్రభావం.. 31.5 అంగుళాలు వాలి భ్రమణం
  3. భారత్‌లో ప్రమాదకరస్థాయిలో గ్రౌండ్ వాటర్ వినియోగం 
  4. ఫలితంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. పెరిగిన సముద్ర మట్టం

న్యూయార్క్, నవంబర్ 25: మావవాళి అవసరానికి మించి భూగర్భజలాలు తోడేస్తుండడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అంతేకాదు.. భూభ్రమణంలోనూ గణనీయమైన మార్పు వచ్చింది. 1993 నుంచి 2010 వరకు 2,150 గిగా టన్నుల భూగర్భజలాలను తోడేసినట్లు జియాలజీ శాస్త్రవేత్త కి విన్ సియో పరిశోధనలో తేలింది.

తాజాగా ఆయన రాసిన పరిశోధనా వ్యాసం ‘జియో ఫిజికల్ రీసెర్చ్ లెటర్స్ జర్నల్’లో ప్రచురితమైంది. ఈ జర్నల్ ప్రకారం.. భూగర్భజలాల వినియోగంతో ఏడాదికి సగటున 3.5 మి.మీ సము ద్ర మట్టం పెరుగుతూ వస్తున్నది. తద్వారా రెండు దశాబ్దాలద్లో సముద్ర మట్టం 0.24 అంగుళాలు (6 మి.మీ) పెరిగింది. సాధారణ భ్రమణం కంటే భూమి అక్షం 31.5 అంగుళాలు (80 సెం.మీ) కుంగి భూమి పరిభ్రమిస్తున్నది.

పశ్చిమ ఉత్తర అమెరికా వాయవ్య భారత్ మధ్య ఈ ప్రభావం ఎక్కువ ఉంది. ఈ దేశాల పరిధిలో సముద్ర మట్టం స్వల్పంగా పెరిగింది. ఇదే విషయాన్ని 2016లో ‘నాసా’ పరిధిలోని ‘జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త సురేంద్ర అధికారి ప్రకటించారు. ఈ అధ్యయనాన్ని తాజాగా శాస్త్రవేత్త కి విన్ సియో బలపరిచారు. 

ఇండియాలో వాడకం ఇలా..

ముఖ్యంగా భారత్‌లో భూగర్భజలాల వినియోగం పరిమితికి మించి ఉందని అధ్యయనాలు వెల్లడించాయి. అనేకమంది శాస్త్రవేత్తలు రెండు దశాబ్దాల నుంచి హెచ్చరిస్తున్నారు.  ప్రస్తుతం ఏడాదికి 230 క్యూబిక్ కి.మీ భూగర్భ జలాల వినియోగం జరుగుతున్నది. ఇది భూమిపై ఉన్న మొత్తం నీటిలో 4శాతం. కాగ్ నివేదిక ప్రకారం.. 2004లో భూగర్భజలాల్లో 58శాతం వినియోగించగా, 2017 వచ్చే సరికే ఈ వినియోగం 63శాతానికి పెరిగింది. 2024 నాటికి ఈ శాతం 70శాతం వరకు చేరుకోవచ్చని ఓ అంచనా. 

గ్రౌండ్ వాటర్ 0.61 శాతమే..

భూమిపై ఉన్న జలంలో 97.2 శాతం సముద్రాల్లోనే ఉన్నది. మంచు పర్వతాల రూపంలో కేవలం 2.15 శాతం, నదుల్లో 0.0001 శాతం,  సరస్సుల్లో 0.009 శాతం ఉంది. ఇక భూగర్భజలమైతే కేవలం 0.61శాతం మాత్రమే ఉంది. వందశాతంలో ఇక మిగిలినది వాతవరణంలోని తేమ.

సరస్సులు, సముద్రాలు, నదుల నుంచి లభించే నీరు ఉపతల నీరు. వర్షాలు, మంచుకొండలు కరిగి గురుత్వాకర్షణకు లోనై భూమి లో ఇంకిన నీరు భూగర్భజలం. జలాలను తనలో ఇముడ్చుకునే క్రమంలో భూమి ఒక స్పాంజిలా పనిచేస్తుంది. భూమిని రాతిపొరల్లో  భద్రపరుచుకుంటుంది.

ఇబ్బడిముబ్బ డిగా బావులు తవ్వడం, బోర్లు వేయడంతో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. మానవాళి అవసరానికి మించి భూగర్భజలాలను వినియోగించడంతో భూభ్రమణంపై ప్రభా వం పడుతున్నది. సముద్ర మట్టం పెరుగుదలకూ కారణమవుతుంది.