calender_icon.png 19 September, 2024 | 10:26 PM

కొత్త దంపతుల కర్తవ్యం

20-07-2024 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

భార్యాభర్తలు ఒక్క దగ్గర ఉండలేని స్థితి ఏర్పడబోతున్నప్పుడు వారికి అంత త్వరగా పెళ్లి చేయాల్సిన అవసరమేమిటి? దాంపత్యం అంటే భార్యాభర్తలు కలిసి కాపురం చేయడం కదా! 

యుక్తవయసులో చాలామందికి చదువుకొనే సమయంలోనే పెళ్లి ఒక సమస్యగా మారుతుంటుంది. కొందరికి చదువు మధ్యలోనే పెళ్లి జరిగిపోతుంది. కొత్తగా పెళ్లయిన దంపతులకు ముఖ్యం కాపురమా, చదువుసంధ్యలా? యువత చదువు పూర్తి కాకుండా పెండ్లికి సిద్ధం కాకూడదు. కానీ, ముఖ్యంగా ఆడపిల్లల విషయం వేరుగా ఉంటుంది. ఏవో కారణాలవల్ల ఒకవేళ పెళ్లి చేసుకున్నా అటు చదువు, ఇటు కాపురం రెండూ కావాలంటే కష్టమే. అలాంటప్పుడు దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? ఇటువంటి తరుణంలో తల్లిదండ్రులకంటే పెద్ద బాధ్యత చదువు చెప్పే గురువులపై పడుతుంది. వారే మార్గదర్శకుల పాత్రను పోషించవలసి ఉంటుంది.

స్కూలు చదువులో అంతా చిన్నతనమే. కాలేజీలోకి ప్రవేశించిన వారికి టీనేజ్. ఇంకా పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయికి చేరుకున్న వారు యుక్తవయస్కులు. ఏ దశలో ఆ మేరకు బోధకులు ఆత్మీయమైన పాత్ర ను నిర్వహించవలసి వస్తుంది. జీవితాన్ని మలుపు తిప్పే పెద్ద సమస్యలు ఎదురైన యువతకు వెంటనే సముచిత పరిష్కారం అందించగల టీచర్లు దొరకడం చాలా అరుదు. అదికూడా వివేకంతో కూడిన మార్గదర్శనం అయి ఉండాలి. పూర్వం గురుకులాలు ఈ మార్గంలో నడిచినవే.

అప్పుడు నేను కోఠి మహిళా కళాశాలలో పని చేస్తున్నాను. నా క్లాసులో ముప్పయి మంది విద్యార్థినులు ఉన్నారు. వారిలో ఒక అమ్మాయి భాగ్యలక్ష్మి. ఒకరోజు క్లాసు కాగానే, ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి వెడ్డింగ్ కార్డు ఇస్తూ అంది “నా పెళ్లికి మీరు తప్పక రావాలి సార్‌”. నేనున్న బోడుప్పల్‌కు సమీపంలోనే ఆ అమ్మాయి పెళ్లి జరుగుతుంది కనుక, ఆమెకు వస్తానని మాట ఇచ్చాను. ఆ ప్రకారమే తన పెళ్లికి వెళ్లాను. పెళ్లి ఘనంగా జరిగింది. “వీరు మా సారు” అని ఆ అమ్మాయి తన భర్తకు నన్ను పరిచయం చేసింది కూడా. పెళ్లి అయింది గనుక ఆ అమ్మాయి ఇక, కాలేజీకి రాదని అనుకున్నాను. కాని, వారం రోజుల తర్వాత క్లాసులో కనిపించింది. 

నాకు ఆశ్చర్యం కల్గింది. పెళ్లయి, కాళ్ల పారాణి అయినా ఆరక ముందే తొందరపడి కళాశాలకు వచ్చినందుకు ఒకింత కోపమూ వచ్చింది. 

“ఏమమ్మా! అప్పుడే వచ్చావా? ఓ వారం రోజులు సెలవు తీసుకోక పోయావా?” అని అడిగాను. 

“లేదు సార్. మా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. పంజాబ్‌లో ఉద్యోగం. సెలవులై పోయాయి కనుక, తిరిగి ఆయన అక్కడికే వెళ్లాడు” అంది. 

“మరి, నువ్వు కూడా వెళ్లక పోయావా?” అన్నాను. 

దానికా అమ్మాయి ఇచ్చిన జవాబు మళ్లీ నన్ను ఆశ్చర్యంలో ముంచింది. 

“మా అత్తగారిక్కడే ఉంటారు. మామ లేరు. అత్తగారికి తోడుగా నేను ఉండాలి. ఈలోగా నా ఎం.ఏ. చదువు పూర్తి అవుతుంది కదాని..” అంది, స్వరంలో కొంచెం బాధ కూడా ధ్వనించింది.

“మీ అత్తను అడగలేక పోయావా, నేను కూడా తనతోపాటు పంజాబ్‌కు వెళతానని” ప్రశ్నించాను. 

అమ్మాయి అడిగిందట కానీ, అత్తగారు సమాధానంగా

“నువు చిన్న పిల్లవు. చదువుకుంటున్నావుగా. చదువు పూర్తి కాగానే పోదువులే” అని సముదాయించిందట. 

కొత్తగా పెళ్లయిన జంట ఒక దగ్గరుండడమే న్యాయం. ప్రమోషన్ పేరుతో భర్త పరాయి రాష్ట్రానికి వెళితే, అతని భార్య చదువు పేరుతో భర్తకు దూరంగా, అత్తగారింట్లో ఉండడం ఎంతవరకు భావ్యం! ఇది సరైన పని కాదనిపించింది నాకు.  ‘నాకెందుకులే అని ఊరుకోవాలా! లేక ఇది మంచి పద్ధతి కాదని చెప్పాలా?’ అని ఒక్క క్షణం ఆలోచించి, అన్నాను. “అమ్మాయీ! నువ్వు కూడా వెళ్లరాదా?”. 

“సార్ నా చదువు పూర్తి కాగానే మా అత్తగారు పంజాబ్‌కు పంపిస్తానని అన్నారు” అని జవాబిచ్చింది వినయంగా తలొంచుకొని.

నాకు ఒకింత కోపమే వచ్చింది. ఎందుకంటే, కొత్తగా పెళ్లయిన దంపతులను అలా విడదీయడం ఏమిటి? ఇక, సలహాగా కాకుండా హెచ్చరిక వలె చెప్పాను ఆమెతో. “నువ్వు రేపు క్లాసులో కనిపిస్తే ఊరుకోను. మీ అత్తగారితో నా మాటగా చెప్పు, మా సారు కొత్తగా పెళ్లయిన జంట ఒక్క దగ్గరే ఉండాలన్నారని!” కొంచెం గట్టిగానే చెప్పాను. నా మాటలు బాగా పని చేసినట్లున్నాయనడానికి నిదర్శనంగా భాగ్యలక్ష్మి మర్నాడు క్లాసులో కనిపించలేదు. ఆ తర్వాత తెలిసింది ఆమె స్నేహితుల ద్వారా, ‘భాగ్యలక్ష్మి పంజాబుకు వెళ్లిందని’. 

విత్తులోని రెండు పలుకులు 

నాకు చాలా సంతోషమైంది. భార్యాభర్తలు ఒక్క దగ్గర ఉండలేని స్థితి ఏర్పడబోతున్నప్పుడు వారికి అంత త్వరగా పెళ్లి చేయాల్సిన అవసరమేమిటి? దాంపత్యం అంటే భార్యాభర్తలు కలిసి కాపురం చేయడం కదా? ఉపనిషత్తులు దంపతులైన భార్యాభర్తల్ని ఒక్క విత్తులోని రెండు పలుకులతో పోలుస్తాయి. తరాజులోని పళ్లాలు ఎక్కువ, తక్కువ కావచ్చు కాని, భార్యాభర్తలు మాత్రం ఎన్ని ఎక్కువ తక్కువలున్నా చెదరకుండా తరాజున్నట్లే కలిసి ఉండాలి. పళ్లాలెక్కడైనా తరాజును విడిచి పెట్టి పోలేవు కదా!

నాలుగైదు సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఒకరోజు నేను హైదరాబాద్‌లో ఒక పెళ్లికి వెళ్లాను. అక్కడ నా కాళ్లకు నమస్కరిస్తున్న ఒక అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాను ఆమె ఎవరో కాదు, భాగ్యలక్ష్మి! ఆమె పక్కన భర్త, ఇద్దరు పిల్లలు వున్నారు కూడా. నేను తేరుకోక ముందే అమ్మాయి నాతో అంది 

“సార్, ఇటీవలే మా వారికి హైదరాబాద్‌కు బదిలీ అయింది. ఇంతకాలం నేను పంజాబ్‌లోనే ఆనందంగా ఉన్నాను. మీరు చెప్పకపోతే నేను అక్కడికి వెళ్లేదాన్ని కాదు. మీ ఆశీర్వాదం నా మీద ఉంది. దేవుడు నాకు ఇద్దరు మగపిల్లల్ని ఇచ్చాడు” అని చెప్తూ ఉంటే, నమ్మశక్యం కాని విధంగా నా కళ్లు చెమర్చాయి. ఎందుకంటే, నాకు తెలియకుండానే నేను ఒక మంచిపని చేశాను కదా అని. 

భాగ్యలక్ష్మిని, ఆమె భర్తను అభినందించి, పిల్లలను ఆశీర్వదించాను. అప్పుడు ఆమె నాతో ఒక మాటన్నది “సార్! నాకు ఇప్పుడు ఎంఏ పూర్తి చేయాలని ఉంది. మళ్లీ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్నాను. మీరే నాకు గురువులు!” ఆ మాటలకు నాకు మరింత సంతోషమైంది. ఒక గురువుకు ఇంతకంటే కావలసింది ఇంకేముంటుంది!

వ్యాసకర్త సెల్: 9885654381