16-04-2025 02:07:10 AM
జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): ప్రతి గ్రామంలో తిరుగుతూ..ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి తాగునీటి సమస్య, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాబోవు మే , జూన్ మాసాలు వేసవి సీజన్ దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా గ్రామాలలో పరిశీలన చేయాలని సూచించారు. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలన్నారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం గ్రామాలలో ప్రజలతో సమీక్షించాలని అన్నారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల గురించి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ పూరి గుడిసె, పై కప్పు సరిగ్గా లేని అర్హులైన నిరు పేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించించారు. ఎటువంటి పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్వహించాలని L-1,L-2,L-3 జాబితాలోని కుటుంబ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. అర్హులైన నిరు పేదలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను అందించే విధంగా కృషి చేయాలన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పధకం కింద ఆన్లైన్లో దరఖాస్తు చేసిన ప్రతి లబ్ధిదారులు సంబంధిత ఎంపీడీవో, మున్సిపాలిటీ లలో దరఖాస్తులు అందజేయాలని, దరఖాస్తు లేని లబ్ధిదారునికి సంబంధిత అధికారులు ఫోన్ చేసి దరఖాస్తు సమర్పించాలని లేనిచో రాయితీ వర్తింపజేయని సమాచారం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో జడ్పీ సీఈవో శోభారాణి, భువనగిరి చౌటుప్పల్ ఆర్డీవోలు కృష్ణారెడ్డి శేఖర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,ఎస్.ఈ ఆర్డబ్ల్యూఎస్ , మిషన్ భగీరథ ఈ.ఈ కరుణాకర్ , జిల్లాలోని తహసిల్దారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీ ఓలు, హౌసింగ్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.