calender_icon.png 23 November, 2024 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనకు కాలవ్యవధి ఎక్కువ.. బడ్జెట్ తక్కువే!

15-10-2024 03:35:49 AM

ఏపీలో 15, బీహార్‌లో 45, కర్ణాటకలో 50 రోజుల్లో పూర్తి 

తెలంగాణలో సర్వేకు 60 రోజులు.. రూ.150 కోట్ల బడ్జెట్

బీహార్‌లో రూ.410 కోట్లు, కర్ణాటకలో రూ.162 కోట్లు

క్రాంతి మల్లాడి :

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్రప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఉత్తర్వులతో తెలంగాణలో కులగణనకు లైన్ క్లియరైంది. ఈ ప్రక్రియకు ప్రభుత్వం 60 రోజుల సమయాన్ని నిర్ధారించింది. తెలంగాణలో చేపట్టే కులగణన సర్వే కోసం రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక, బీహార్ రాష్ట్రాల్లో అవలంబించిన పద్ధతులను పరిశీలించింది.

కావా ల్సిన అంశాలను స్వీకరించింది. ఈ నేపథ్యం లో ఆయా రాష్ట్రాల్లో అమలు చేసిన పద్ధతులను పరిశీలించాల్సిన అవసరముంది. అయితే కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కులగణనకు తీసుకున్న కాలవ్యవధి, ఖర్చు చేసిన నిధులు, డాటా స్వీకరణ పద్ధతులను గమనిస్తే.. ప్రస్తుతం తెలంగాణ చేపట్టే కులగణన సర్వేకు తీసుకుంటున్న సమయం కాస్త ఎక్కువగా ఉంది. కానీ బడ్జెట్ మాత్రం మిగిలిన రాష్ట్రాల కంటే తక్కువే కేటాయించారు.

తెలంగాణలో కాలవ్యవధి ఎక్కువ

కర్ణాటకలో 2015లో కులగణన చేపట్టారు. ఇందుకోసం 50 రోజుల సమయం పట్టింది. బీహార్‌లో 2023లో కులగణన చేపట్టగా.. ఆ రాష్ట్రంలో 45 రోజుల్లోనే ప్రక్రియను పూర్తి చేశారు. తాజాగా ఆంధ్రప్ర దేశ్‌లో 15 రోజుల్లోనే సర్వే పూర్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో గణన నిర్వహించింది.

అయితే ఆ సర్వేను కేవలం ఒకేరో జులో పూర్తి చేయడం విశేషం. వీటన్నింటికి ముందు 2011లో కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక, కుల గణనను చేప ట్టింది. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో వివిధ దఫాల్లో నిర్వహించారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే సర్వేకు మాత్రం 60 రోజుల నిర్ణీత సమయాన్ని కేటాయించారు. కులగణన చేపట్టిన ఆయా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అధికంగా సమయం పడుతున్నట్టు స్పష్టమవుతోంది. 

బడ్జెట్ తక్కువ

రాష్ట్రవ్యాప్తంగా కులగణన కోసం కర్ణాటక ప్రభుత్వం రూ.162.67 కోట్లు ఖర్చుచేసింది. ఇందుకోసం బీహార్ రూ.410 కోట్లు వెచ్చించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఇటీవల నిర్వహించిన సర్వే ఖర్చుకు సంబంధించిన సమాచారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదు. 2011లో దేశవ్యాప్తంగా జరిగిన జనాభా లెక్కల సర్వేకు దాదాపు రూ.4,894 కోట్ల నిధులను ఖర్చు చేశారు.

తెలంగాణలో 2014లో చేపట్టిన ఎస్‌కేఎస్ సర్వేకు ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులకు సంబంధించిన వివరాలేమీ అప్పటి ప్రభుత్వం వెల్లడించకపోవడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే సర్వేకు మాత్రం రూ.150 కోట్లు కేటాయించింది. అయితే కులగణన కోసం ఖర్చు చేసే నిధుల విషయంలో ఆయా రాష్ట్రాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం తక్కువ ఖర్చుతోనే సర్వేను పూర్తి చేయనున్నది. 

గతంలో మాన్యువల్.. ఇప్పుడు డిజిటల్..

తెలంగాణలో త్వరలో కులగణన చేపట్టనున్న నేపథ్యంలో సర్వే ఏవిధంగా చేస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. 2014లో చేపట్టిన సర్వేలో భాగంగా మాన్యువల్‌గా  డేటాను సేకరించారు. కానీ ప్రస్తుతం డిజిటల్ పద్ధతిలో సమాచారాన్ని సేకరించనున్నట్టు తెలుస్తోంది.

సర్వేకు మోడల్‌గా తీసుకున్న కర్ణాటకలోనూ మాన్యువల్‌గానే నిర్వహించారు. బీహార్‌లో మాత్రం డేటా సేకరణకు రెండు రకాల పద్ధతులను ఉపయోగించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సర్వే, 2011లో చేపట్టిన దేశవ్యాప్త జనాభా లెక్కల సేకరణ మాత్రం డిజిటల్ పద్ధతిలోనే డేటా సేకరించారు. 

రాష్ట్రం సర్వే ఏడాది ఖర్చు (కోట్లలో) కాలవ్యవధి డేటా స్వీకరణ పద్ధతి

కర్ణాటక 2015 162.67 50 రోజులు మాన్యువల్

బీహార్ 2023 410 45 రోజులు మాన్యువల్/డిజిటల్

ఆంధ్రప్రదేశ్ 2024 -- 15 రోజులు డిజిటల్

ఎస్‌ఈసీసీ(దేశం) 2011 4,894 పలు దఫాలు డిజిటల్

తెలంగాణ (ఎస్‌కేఎస్) 2014 ------ ఒకే రోజు మాన్యువల్

తెలంగాణ 2024 150 60 రోజులు డిజిటల్