26-03-2025 05:32:21 PM
టిఎన్టియుసి డిమాండ్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పాత జిఎం ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ ను మున్సిపల్ అధికారులు వెంటనే టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. మని రామ్ సింగ్ డిమాండ్ చేశారు. బుధవారం డంపింగ్ యార్డ్ వద్ద ఇఫ్టు రాష్ట్ర నాయకులు ఎండి చాంద్ పాషా, ఏఐఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు ఎం.పోషమల్లు, టిఎస్యుఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నీరటి రాజన్న, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబాల మహేందర్ లతో కలిసి నిరసన తెలిపారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ విషయంలో మున్సిపల్ అధికారులు, పాలకవర్గం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గతంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో వ్యర్ధాలు తగలబెట్టడం వల్ల దట్టమైన పొగ వ్యాపించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిందని తెలిపారు.
ఈ సంఘటనపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. 65 డిప్ వద్ద డంపింగ్ యార్డ్ ను ప్రజలు వ్యతిరేకించారని తెలిపారు. బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డులోని పాత మునిసిపాలిటీ ఆవరణలో 34 వార్డులకు సంబంధించిన వ్యర్ధపదార్థాలను తీసుకువచ్చి డంపింగ్ చేస్తున్నారని, దీంతో తీవ్రమైన దుర్గంధం వ్యాపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈగలు దోమలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. పోచమ్మ గడ్డ వద్దగల ఐటీడీఏ ఉద్యానవనం, స్మశాన వాటిక పక్కన, గ్రామీణ రహదారుల పక్కన చిత్తవేస్తున్నంతో తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతుందని ఆరోపించారు. చెత్త వేయడం వల్ల బెల్లంపల్లికి వచ్చి పోయే ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి వీధి భూములన్ని ప్రభుత్వానికి అప్పగించడంతో కబ్జాలకు గురవుతున్నాయని ఆరోపించారు. మున్సిపాలిటీకి డంపు యాడుకు భూమి కేటాయించడం మాత్రం ఏ ప్రభుత్వ అధికారికి సాధ్యం కావడం లేదని వారు ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసే ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు డంపింగ్ యార్డ్ సమస్య పట్టడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు పూర్తయినప్పటికీ వార్డులలో నీటి సరఫరా జరగలేదని, వెంటనే అధికారులు చర్యలు తీసుకొని ప్రజలకు త్రాగునీరు అందించాలని కోరారు. లేనట్లయితే తాము చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు కలెక్టర్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్, తహసిల్దార్ లే కారణమవుతారని హెచ్చరించారు.