07-02-2025 12:00:00 AM
బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్
కొల్చారం. ఫిబ్రవరి 6: రాష్ట్ర ప్రభుత్వం నల్లవల్లి అటవీ ప్రాంతంలో 150 ఎకరాలలో డంపు యార్డు ఏర్పాటు ఆలోచనను వెంటనే విరమించుకోకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ హెచ్చరించారు.
కొల్చారంలో బిజెపి మండల శాఖ అధ్యక్షులు గణపురం పంతులు హరీష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన గురువారం మాట్లాడుతూ నర్సాపూర్ ప్రాంత ప్రజలు ఇప్పటికే ఇరువైపులా బోరపట్ల, బొంతపల్లి పారిశ్రామికవాడల వాయు జల కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారని అలాంటి నర్సాపూర్ ప్రాంతంలో ని పచ్చని అటవీ ప్రాంతమైన నల్లవెల్లి ప్రాంతంలో 150 ఎకరాలలో డంపు యార్డు ఏర్పాటు చేయడం వల్ల నర్సాపూర్ ప్రాంత ప్రజలు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున వెంటనే ప్రభుత్వం డంప్ యార్డ్ ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలన్నారు.
ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే మెదక్ ఎంపీ రఘునందన్ రావు నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి డంపు యార్డ్ ఏర్పాటు పనులు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో భాజపా సీనియర్ నాయకులు మంగలి లింగం, గిరిజన మోర్చా అధ్యక్షులు పూల్ సింగ్, అంజి నాయక్, శివలల్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.