calender_icon.png 4 February, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తరిగిపోయిన తుర్కచెరువు!

04-02-2025 12:54:44 AM

  • బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ను ఆక్రమించి ఫాం హౌస్‌ల నిర్మాణాలు
  • నాలుగేళ్ల కిందే నలుగురిపై కేసు పెట్టిన ఇరిగేషన్ అధికారులు
  • అయినా ఆగని కబ్జాలు.. అనుమతుల్లేకుండానే కట్టడాలు
  • ఆక్రమణలు తొలగించి చెరువును కాపాడాలంటున్న గ్రామస్తులు

చేవెళ్ల, ఫిబ్రవరి 3: హైదరాబాద్కు కూత వేటు దూరంలో ఉన్న చెరువది..  అందులోనూ 111 జీవో పరిధి.  ఇక్కడ కనీసం బఫర్ జోన్ను ఆక్రమించి  చిన్నపాటి షెడ్డులు కట్టేందుకు కూడా వీలు ఉండదు.  కానీ, బఫర్ జోనే కాదు.. ఎఫ్టీఎల్ను సైతం కబ్జా చేసి అందులో మట్టి పోసి ఏకంగా విల్లాలు, ఫాం హౌస్లు కట్టేశారు. నాలుగేళ్ల కిందే ఈ ఆక్రమణలు గుర్తించిన ఇరిగేషన్ అధికారులు  నలుగురు వ్యక్తులపై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ ప్రివెన్షన్ యాక్ట్(పీడీపీపీ) కింద కేసు నమోదు చేశారు. 

ఆ తర్వాత రెవెన్యూ అధికారులకు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని లేఖలు కూడా రాశారు.  అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  దీన్ని ఆసరాగా చేసుకున్న  ఇంకొందరు వ్యక్తులు కూడా చెరువును ఆక్రమించి మరికొన్ని నిర్మాణాలు  చేపట్టారని మండిపడుతున్నారు.  ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు హైడ్రా తీసుకొచ్చి చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తుండడంతో తమ చెరువును రక్షించాలని  కోరుతున్నారు.  

28.08 ఎకరాల చెరువు

శంకర్ పల్లి మండలం దొంతన్ పల్లి  గ్రామానికి ఉత్తరం వైపున హైదరాబాద్ శంకర్ పల్లి రోడ్డు పక్కన సర్వే నెంబర్లు 6/1, 6/2, 9, 10, 11, 12,13, 18,22 , 26/1 లలో  28 .08 ఎకరాల్లో తుర్క చెరువు విస్తరించి ఉంది.  దీనికి ఎఫ్టీఎల్ నుంచి 30 మీటర్ల బఫర్ జోన్ కూడా నిర్దారించారు.  ఈ చెరువు కింద గతంలో  గ్రామస్తులు పంటలు కూడా పండించేవారు.

ఈ చెరువు నిండితే చుట్టు పక్కల బోర్లు నిండుగా పోస్తాయని, వాటి కిందే వ్యవసాయం చేస్తామని గ్రామ రైతులు చెబుతున్నారు.  కానీ, క్రమేపీ హైదరాబాద్ విస్తరిస్తూ మోకిలా, శంకర్ పల్లి వరకు రావడంతో ఈ ప్రాంతంలో భూములకు రెక్కలొచ్చాయి.  దీంతో ఈ చెరువుపై కన్నేసిన కొందరు వ్యక్తులు బఫర్ జోనే కాదు ఎఫ్టీఎల్ను కూడా ఆక్రమించారు. అంతేకాదు చెరువులో మట్టి పోసి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు.  

2021లో నలుగురిపై కేసు 

 స్థానికుల ఫిర్యాదు మేరకు 2021 మార్చి 20 నుంచి 25 వరకు  తుర్క చెరువు స్థలాన్ని పరిశీలించిన ఇరిగేషన్ అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు.   శ్రీనివాస్ రాజ్ అనే వ్యక్తి సర్వే నెంబర్లు 9,10,11,18 లో, మహమ్మద్ ఆరిఫ్ ఖాన్, రహీమ్ అనే వ్యక్తులు సర్వే నెంబర్ 6/2లో, రాజేష్ జైన్  సర్వే నెంబర్లు 12, 22, 26/2లో చెరువు స్థలాన్ని  ఆక్రమించి మట్టితో నింపినట్లు గుర్తించారు. 

అంతే కాదు ఇందులో అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టడంతో 2021 మార్చి 26న పీడీపీపీ యాక్ట్- 1984 కింద  శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు చేవెళ్ల కోర్టు పరిధిలో ఉందని, ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు లేఖలు రాసినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.  

చర్యలు తీసుకుంటం..

దొంతన్ పల్లి తుర్క చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు మా దృష్టికి వచ్చింది.  ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే పలువురిపై కేసులు పెట్టడంతో పాటు చర్యల కోసం లేఖలు కూడా రాశారు.  వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటం.  

-- సురేందర్, శంకర్‌పల్లి తహసీల్దార్