- గవర్నర్, సీఎంతో విలయ ప్రాంతంలో విహంగ వీక్షణం
- క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు పరామర్శ
- నష్ట అంచనాలు రాగానే సాయం చేస్తామని ప్రకటన
వయనాడ్ (కేరళ), ఆగస్టు 10: ప్రకృతి ప్రకోపానికి బలైన కేరళలోని వయనాడ్ ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం పర్యటించారు. ఉదయం 11 గంటలకు కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీ.. వాయుసేన హెలికాప్టర్‌లో కొండచరియలు విరిగిపడిన విధ్వంసం సృష్టించిన ప్రాంతంలోని చూరాల్‌మాలా, ముంద క్కై, పూంచిరిమట్టం గ్రామాల్లో కేరళ గవర్నర్ ఆరిప్ మహమ్మద్, సీఎం పినరయి విజయన్‌తో కలిసి ఏరియల్ సర్వే నిర్వహించారు.
అనంతరం ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడినవారు, నిరాశ్రయులను మోదీ పరామర్శించారు. వయనాడ్ విపత్తుపై గవర్నర్, విజయన్, కేంద్రమంత్రి సురేశ్‌గోపి, జిల్లా ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు, సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బాధితులకు అండగా ఉందాం
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. విపత్తు సంభవించినప్పటి నుంచి ఎప్పటికప్పు డు సమాచారాన్ని తెలుసుకుంటున్నా. ప్రకృతి విధ్వంసంతో వందలాది మంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు. ఈ విలయంతో వాళ్ల కలలన్నీ కుదేలయ్యాయి. ఈ దుఃఖ సమయంలో బాధితులకు అండగా ఉంటా. పున రావాస కేంద్రాల్లో బాధితులను కలిశాను. క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించాను. వాళ్ల చాలా కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
అంతా కలిసి పనిచేస్తేనే వారికి అండ గా ఉండగలం. రాష్ట్ర ప్రభుత్వం నష్టం అంచనాలు పంపిన వెంటనే విపత్తు సాయం అందిస్తాం అని పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడే సీఎం విజయన్‌తో మాట్లాడానని, తప్పకుండా సాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు మోదీ చెప్పారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, పోలీసులు, డాక్టర్లు ఎంతో కృషి చేశారని కొనియాడారు.
జాతీయ విపత్తుపై స్పందించని మోదీ
వయనాడ్‌లో మోదీ పర్యటనపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. భయంకరమైన విపత్తుతో అల్లకల్లోలమైన వయనాడ్‌ను సందర్శించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ జరిగిన ప్రకృతి విలయాన్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత జాతీయ విపత్తుగా ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొన్ని రోజులుగా రాహుల్‌గాంధీతో పాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన పలువురు ఎంపీలు వయనాడ్ విషాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీని వల్ల బాధితులకు సాయం, పునరావాసం కోసం అదనపు నిధులు లభిస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కానీ, దీనిపై మోదీ స్పందించకపోవడం గమనార్హం. జూలై 29, 30 తేదీల్లో వయనాడ్ జిల్లాలో జరిగిన విధ్వంసంలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగి పడటంతో వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.