calender_icon.png 26 December, 2024 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాపె నేడు క్యాబినెట్‌లో చర్చ

01-08-2024 12:54:56 AM

అనంతరం అసెంబ్లీలో చర్చించనున్న ప్రభుత్వం

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 31 (విజయక్రాంతి):  తెలంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న నూతన ఆర్‌ఓఆర్ (రికార్డు ఆఫ్ రైట్) చట్టం ముసాయిదాపై గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే క్యాబినెట్‌లో చర్చించనున్నారు. క్యాబినెట్ సమావేశంలో నూతన రెవెన్యూ చట్టం ముసాయి దాతోపాటు రాష్ట్రంలో రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నూతన రెవెన్యూ చట్టం ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టి రాష్ట్రంలో కొత్త చట్టం అనివార్యతపై వివరణ ఇవ్వనున్నారు.

ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తాం

 ధరణి పాలసీని తీసుకొస్తున్నామని, దీనిపై తాము చేసిన కసరత్తును ఒకటి రెండు రోజుల్లో  సంబంధిత మంత్రి వెల్లడిస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం అసెంబ్లీలో చెప్పారు. దానిపై ఏమైనా సలహాలు, సూచనలుంటే ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాలన్నారు. ఎనిమిది నెలల్లోనే తాము ఏమీ చేయలేదన్నట్లుగా, పూర్తిగా వైఫల్యం చెందినట్లుగా ప్రతిపక్షం విమర్శలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఒక తీర్పు ఇచ్చారని, బీఆర్‌ఎస్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చారన్నారు.

ఇప్పుడు ఎన్నికలు కూడా లేవని పేర్కొన్నారు. తాము అన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే, తాము ఎలాంటి పాలసీ తీసుకురాలేదని బీఆర్‌ఎస్ చెబుతోందని అంటున్నారని, ఇంతకీ మీరేం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాలనలో విద్యుత్ పాలసీ, టూరిజం పాలసీ, డెవలప్‌మెంట్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ లేదన్నారు. తాము త్వరలో అన్ని రకాలపై పాలసీలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.