calender_icon.png 27 September, 2024 | 9:38 AM

సీబీఐకి డోర్లు క్లోజ్

27-09-2024 12:58:39 AM

జనరల్ కన్సెంట్ రద్దుచేసిన కర్ణాటక ప్రభుత్వం

  1. ముడా కుంభకోణంపై దర్యాప్తు నేపథ్యంలో నిర్ణయం
  2. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమా
  3. ప్రధాని మోదీకి సిద్ధరామయ్య సవాల్
  4. సిద్ధరామయ్య రాజీనామా చేయాల్సిందే
  5. బెంగళూరులో బీజేపీ భారీ నిరసన

బెంగళూరు, సెప్టెంబర్ 26: కర్ణాటకలో ముడా కుంభకోణంపై రాజకీయం ఎత్తుకు పై ఎత్తు అన్నట్టుగా సాగుతున్నది. ఈ కుంభకోణంపై లోకాయుక్త దర్యాప్తునకు హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ఆత్మ రక్షణ చర్యలకు ఉపక్రమించింది. కర్ణాటకలో కేసులు దర్యాప్తు జరిపేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి ఇచ్చిన సాధారణ అనుమతి (జనరల్ కన్సెంట్)ను రద్దుచేస్తూ ఆ రాష్ట్ర క్యాబినెట్ గురువారం నిర్ణయం తీసుకొన్నది.

గతంలో జారీచేసిన జనరల్ కన్సెంట్ నోటిఫికేషన్‌ను రద్దుచేయాలని నిర్ణయించింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల కేటాయింపులో సీఎం సిద్ధరామయ్య తన సతీమణికి ఆయాచిత లబ్ధి చేకూర్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వగా.. సిద్ధరామయ్య గతంలో హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకొన్నారు. అయితే బుధవారం హైకోర్టు స్టే ఎత్తివేసి లోకాయుక్త దర్యాప్తునకు ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని పట్టుబడుతున్నది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే సీబీఐ కర్ణాటకలో కాలుపెట్టకుండా అడ్డుకొన్నది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం ఏర్పడిన సీబీఐ ఇతర రాష్ట్రాల్లో కేసులు దర్యాప్తు చేయాలంటే ఆయా రాష్ట్రాల సాధారణ అనుమతి తప్పనిసరి. సీబీఐని కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నందువల్లనే తమ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ నిర్ణయం తీసుకొన్నదని కర్ణాటక మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు. ఒకవేళ ఏదైనా కేసును కోర్టులు సీబీఐకి అప్పగిస్తే.. అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. ముడా కేసు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోలేదని.. సీబీఐ వెళ్తున్న దారి సరిగా లేనందునే అనుమతి రద్దుచేయాల్సి వచ్చిందని వివరించారు.

అవినీతిపై చర్చకు వస్తావా?

ముఖ్యమంత్రి పోస్టులనే వేలం వేసినవారికి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ముడా కుంభకోణంపై ప్రధాని తనపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని ప్రధానికి సవాల్ విసిరారు. ‘ముఖ్యమంత్రి పదవిని రూ.2,500 కోట్లకు అమ్ముకున్నాడని సొంతపార్టీ నేతలతోనే విమర్శలు ఎదుర్కొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎట్టకేలకు మీరు అవినీతి గురించి మాట్లాడినందుకు సంతోషం. అవినీతిపై మీరు నేరుగా నాతో చర్చకు వస్తే నేను సిద్ధమే. మీకు తోడుగా కర్ణాటక బీజేపీలో అవినీతి మరకలేని నేత ఎవరైనా ఉంటే తెచ్చుకోవచ్చు’ అని ట్వీట్ చేశారు. 

సిద్ధరామయ్య తప్పుకోవాల్సిందే

కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ప్రతిపక్ష బీజేపీ పోరాటం తీవ్రతరం చేసింది. ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది. గురువారం అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు బీజేపీ నేతలు ధర్నా నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.