calender_icon.png 26 October, 2024 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

సైన్యానికి జీవం పోసిన వైద్యుడు

01-07-2024 12:00:00 AM

డాక్టర్ కొట్నీస్.. పూర్తి పేరు ద్వారకానాథ్ శాంతారాయ్ కొట్నీస్. 1910 అక్టోబరు 10న మహారాష్ట్ర, సోలాపూర్‌లో ఒక మధ్యతరగతి గుమస్తా కుటుంబంలో ఏడుగురి బిడ్డలలో రెండోవవాడిగా కొట్నీస్ జన్మించారు. బొంబాయి విశ్వవిద్యాలయానికి చెందిన సేథ్ జీఎస్ వైద్య కళాశాలలో కొట్నీస్ వైద్యవిద్య అభ్యసించారు. సామ్రాజ్యవాదుల చెరనుంచి విముక్తి కోసం భారత్, చైనాలు పోరాటాలు చేస్తున్న రోజులవి. రెండో ప్రపంచయుద్ధానికి ముందు కాలం. జపాన్ దురాక్రమణ ఎదుర్కొంటూ, కనీవినీ ఎరుగని మానవ విషాదాలతో చైనా తల్లడిల్లుతున్న కాలమది. చైనా కమ్యూనిస్టు సేనాని జనరల్ ఛూటే, భారత సహాయాన్ని ఆర్థిస్తూ నెహ్రూకు ఒక ఉత్తరం రాశాడు. సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ ఆ ఉత్తరానికి స్పందించి ఒక వైద్య బృందాన్ని చైనాకు పంపాలని నిశ్చయించి ఒక ప్రకటన చేసింది. అప్పుడే 1936లో వైద్య పట్టా తీసుకున్న కొట్నీస్ చైనా వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఐదుగురి వైద్యుల బృందం ఎంపికైతే అందులో అతి పిన్నవయస్కుడు కొట్నీస్. 

కాంటన్‌లో తొలిసారిగా చూసిన యుద్ధ బీభత్స దృశ్యాలు వారిని కలచివేశాయి. బాంబుల దాడిలో గాయపడ్డ వేలాది మంది స్త్రీ, పురుషులు, బాలబాలికల గాయాలకు, రాత్రనక, పగలనక నిర్విరామంగా వైద్య సేవల్లో తలమునకలయ్యారు. ఇవీ కాంటన్ దృశ్యాలు. చైనాకు ఆ పరిస్థితుల్లో ఐదువేల మంది డాక్టర్లు అవసరం ఉంది. కానీ రెండు వేల మంది మాత్రమే పట్టభద్రులైన డాక్టర్లు ఉన్నారు. వీరిలో ఒక వెయ్యి మంది మాత్రమే యుద్ధరంగంలో పని చేస్తున్నారు. ఇంత తీవ్రమైన వైద్యుల కొరత మధ్య భారతీయ వైద్య బృందం తాము నిర్వహించాల్సిన మాహనీయ పాత్రను బేరీజు వేసుకుంది. కాంటన్ నుంచి హాంకో, అటునుంచి ఇచాంగ్, చుంగ్‌కింగ్, చివరిలో యానాన్.. ఇదీ వైద్య బృందం చేపట్టిన ప్రయాణ మార్గం. హాంకో నగరం నుంచి ఇంటికి రాసిన ఉత్తరంలో కొట్నీస్ ఇలా పేర్కొన్నాడు.

“ఇక్కడ రోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంబులెన్స్ వాహనాల కొరత తీవ్రంగా ఉండటం వల్ల గాయపడిన సైనికులు ఆస్పత్రి వరకూ నడుచుకుంటూ రావాల్సిందే. వారు ఇక్కడకు చేరుకునేటప్పటికి ఒక్కోసారి వారం రోజులు కూడా పడుతుంది. తీవ్రంగా గాయపడిన సైనికులు దారిలోనే మరణిస్తున్నారు. యుద్ధరంగం నుంచి హాంకోకు రోజూ సగటున 800 మంది గాయపడిన సైనికులు చేరుకుంటున్నారు. ఇక డాక్టర్ల, నర్సుల తదితర సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటుంది. ఇందువల్ల రోగులకు సరైన చికిత్స అందడం లేదు. ఒక్క అంగుళం ఖాళీ ప్రదేశం లేకుండా రోగులు చాపలు పరుచుకొని పడుకుంటున్నారు” అని రాశాడు.

చైనా అమ్మాయితో పెళ్లి..

బెథూన్ ఆస్పత్రిలో పని చేస్తున్న సమయంలోనే చింగ్లాన్ (గువో క్విలాన్)తో ఆయనకు పరిచయం అయింది. ఆమె నర్సింగ్ విద్యాలయంలో ఒక టీచర్‌గా పని చేస్తుంది. వారిద్దరూ 1941 నవంబర్ 25న వివాహం చేసుకున్నారు. 1942 ఆగస్టు 23న వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. అతనికి “ఇంగ్‌హువా’ అనే పేరు పెట్టుకున్నారు. ఇంగ్‌హువా అంటే అర్థం భారత్ అని. ఆ కాలంలోనే వైద్య విద్యార్థులకు శస్త్ర చికిత్స పాఠ్యగ్రంథాన్ని రాయడం ప్రారంభించాడు.  విశ్రాంతి మరిచిపోయి నిర్విరామంగా వ్యాధులతో యుద్ధం చేస్తున్న డాక్టర్ కొట్నీస్‌కు మలేరియా సోకింది. మళ్లీ మళ్లీ తిరగబెట్టింది. దానికి తోడు మూర్చ పదే పదే రావడం ప్రారంభమైంది.

జపాన్ దిగ్బంధనం వల్ల అవసరమైన మందులు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో వందలాది ప్రాణాలను కాపాడిన డాక్టర్ కొట్నీస్ 1942 డిసెంబర్ 9న తుదిశ్వాస విడిచారు. మరణించేనాటికి కొట్నీస్ వయసు 32 సంవత్సరాలు. కొట్నీస్ ప్రభావం ఎంతగా చైనాను తాకిందంటే ‘కొట్నీస్ నుంచి నేర్చుకోండి’ అని చైనా అంతటా ఒక ఉద్యమంగా సాగింది. భారత దేశంలో కూడా కొట్నీస్ ఒక వైతాళికుడయ్యాడు. నిజానికి కొట్నీస్ జీవితం ఈనాటి యువకులకు ఒక గొప్ప సందేశాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది. ఆచరణ ద్వారా ఒక వ్యక్తి జీవితంలో ఎంతటి మౌలిక మార్పులు వస్తాయో కొట్నీస్ నిరూపించాడు.