13-03-2025 12:00:00 AM
పటాన్ చెరు, మార్చి 12 : పటాన్ చెరు నియోజకవర్గంలోని పారిశ్రామిక గ్రామాల ప్రజలను కాలుష్యపు భూతం కలవరపెడుతున్నది. ఇది రోజులలు...నెలల సమస్య కాదు...సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. నలబై సంవత్సరాలుగా పారిశ్రామిక ప్రజలు కాలుష్య రక్కసితో జరుపుతున్న పోరాటంలో అనారోగ్య సమస్యలకు గురై అసువులుబాస్తున్నారు.
ఏ నాయకుడు...ఏ అధికారి ప్రజల పక్షాన పోరాడడం లేదు. కనీసం వారి కోసం మాట్లడాడం లేదు. ప్రజలు పడుతున్న ఇబ్బందులే ఏ నాయకుడికైనా...ఏ అధికారికైన కాసులు కురిపించే సాధనంగా మారింది. కొంత మంది రాజకీయ ఎదుగుదల కోసం కాలుష్య సమస్యను ఎత్తుకొని ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకొని తుదకు మద్యలోనే ఆపేస్తున్నారు. పటాన్ చెరు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యపై విజయక్రాంతి ప్రత్యేక కథనం...
పటాన్ చెరు నియోజకవర్గంలో పటాన్ చెరు, పాశమైలారం, ఇస్నాపూర్, చిట్కుల్, ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి, దోమడుగు ప్రాంతాలలో రసాయన, ఐరన్, రబ్బర్ తదితర పరిశ్రమలు ఉన్నాయి. పటాన్ చెరు ప్రాంతం పారిశ్రామిక వాడగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో ఏర్పడ్డాయి. పారిశ్రామిక వాడగా పటాన్ చెరు ప్రాంతానికి ఆసియా ఖండంలోనే పేరుంది.
పరిశ్రమల ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి లభిస్తుందని అందరు సంతోషించినా...క్రమంగా వ్యవసాయం మరుగున పడుతుందని ఆ సమయంలో ఎవరు ఊహించలేదు. రసాయన పరిశ్రమలు వదిలే ప్రమాదకర రసాయన వ్యర్ధాలు భూసారాన్ని దెబ్బతీశాయి. మీటర్ల మేర భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కాలుష్యంతో కలిసిపోయాయి. గాలి విష పూరితమైంది.
దీంతో క్రమంగా ఒక్కొక్కరుగా రైతులు వ్యవసాయాన్ని వదిలేశారు. పరిశ్రమల్లో కార్మికులుగా చేరారు. మెతుకు సీమగా పేరుగాంచిన ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్ చెరు ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పడి ఇక్కడి ప్రజానీకం జీవన శైలిని దూరం చేసింది. క్రమంగా బతుకు చిత్రం మారింది. కాలుష్యం ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. అనారోగ్యాలకు గురవుతు వందేళ్ల జీవితాన్ని మద్యలోనే కాలుష్యం కబలిస్తున్నది.
మేమింతే ఎవరి మాట వినం
పటాన్ చెరు, పాశమైలారం, ఇస్నాపూర్, ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి, దోమడుగు ప్రాంతాలలోని కొన్ని రసాయన పరిశ్రమలు నిబందనలు పట్టించుకోవడం లేదు. మేమింతే..ఎవరి మాట వినం అనే రీతిలో వ్యవహరిస్తున్నాయి. పీసీబీ అధికారులు హెచ్చరిస్తే ఒకటి రెండు రోజుల వరకు నిబందనలు పాటిస్తున్నట్లు నటించి తరువాత యధావిదిగా వ్యవహరిస్తున్నాయి.
దీంతో పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, పారిశ్రామిక ప్రజలు కాలుష్యపు వాసనలో అవస్థలు పడుతున్నారు. విచ్చలవిడిగా పరిశ్రమలోని వ్యర్థాలను వదిలేస్తున్నారు. గొట్టాల ద్వారా పొగను ఆకాశంలోకి వదిలి గాలిలో కలిపేస్తున్నారు. వీటినే పీలుస్తున్న ప్రజలు శ్వాస, ఊపిరిత్తిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు.
రసాయన వ్యర్థాలు సమీపంలోని చెరువు, కుంటల్లోకి చేరుతున్నాయి. ఐడీఏ బొల్లారంలోని ఆసాని కుంట, గడ్డపోతారంలోని అయ్యమ్మ చెరువు, దోమడుగులోని నల్ల చెరువు, ఇస్నాపూర్ చెరువు రసాయన వ్యర్థాల నిల్వకు కేంద్రంగా మారాయి. సంవత్సరాలుగా పరిశ్రమలు ఈ కుంటలను రసాయన వ్యర్థాలకు ఆవాసం అయ్యాయి.
మూగజీవాల మృత్యు వాత
రసాయనాల కారణంగా సామాన్య ప్రజలు అనారోగ్యాలకు గురవుతు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పారిశ్రామిక వాడలోని చెరువు, కుంటల్లోని నీరు తాగి మూగ జీవాలు చనిపోతున్నాయి. ఇటీవల కిష్టయ్యపల్లికి చెందిన బాశెట్టి సాయికుమార్ కుటుంబానికి చెందిన ఇరవై బర్రెలు కాలుష్యం నీళ్లు తాగి ఒక్కొక్కటిగా చనిపోయాయి. దీంతో ఆగ్రహించిన గడ్డపోతారం పంచాయతీ నాయకులు చనిపోయిన బర్రెలతో సనత్ నగర్ లోని పీసీబీ కార్యాలయానికి వెళ్లి గేటు ముందు ఆందోళన చేశారు.
ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పీసీబీ ఎంఎస్ బాధితులకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. పరిశ్రమల ప్రభావం పారిశ్రామిక గ్రామాలకే పరిమితం కాకుండా చుట్టు పక్కల గ్రామాల వరకు వచ్చింది. పగలు, రాత్రి పరిశ్రమల నుంచి ఘాటైన వాసనలు వ్యాపిస్తున్నాయి. రాత్రిపూట మరింత ఎక్కువగా ఉంటోంది.
ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో
పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమల్లో ఎప్పడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థతి నెలకొన్నది. పేలుడు జరిగితేనే ప్రమాదం జరిగినట్లుగా అందిరికి తెలిసేది. లోలోపల జరిగే చిన్న చిన్న ప్రమాదాలు బయటకు రావడం లేదు. ఈ ప్రమాదాలలో కార్మికులు చనిపోయిన బయటకు రానీయడం లేదు. చాలా వరకు పరిశ్రమల్లో పని చేసే వారంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో కొంత డబ్బు ముట్టచెప్పి వాహనంలో వారి ప్రాంతాలకు అప్పటికప్పడే తరలిస్తున్నారు.
గత సంవత్సరం క్రితం పాశమైలారం, గడ్డపోతారం పారిశ్రామిక వాడల్లో భారీ ప్రమాదాలు జరిగాయి. ఇటీవల ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో జరిగిన ప్రమాదంలో ఏకంగా ఐదు మంది గాయపడ్డారు. ఇందులో ఒకరు చనిపోయారు. చనిపోయిన వ్యక్తి, తీవ్రంగా గాయపడిన వ్యక్తులు అందరూ బీహార్, ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వారే. ఇలాంటి ప్రమాదాలలో గాయపడిని వారికి, చనిపోయిన వారికి పరిహారం అందేది కూడా తక్కువే.
పరిశ్రమల్లో నిత్యం తనిఖీలు చేయాలి
రసాయన పరిశ్రమలను ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పీసీబీ అధికారులతో పాటు ఇతర శాఖల అధికారులు నిత్యం తనిఖీలు చేయాలని కార్మికులు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. నిబందనలు పాటించని పరిశ్రమలకు భారీగా జరిమానాలు విధించి పరిశ్రమలను కొన్ని రోజుల పాటు మూసివేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇలాగైతేనే పరిశ్రమల యాజమాన్యాల తీరులో మార్పొస్తుందని అంటున్నారు. ఇటీవల గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని నాలుగు పరిశ్రమలకు పీసీబీ అధికారులు భారీ జరిమానాలు విధించారు. అయినా పరిశ్రమల్లో మార్పు లేదు.