21-03-2025 01:37:35 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, మార్చ్ 20 (విజయ క్రాంతి) : బడ్జెట్ లో ఆదిలాబాద్ కు జరుగుతున్న అన్యాయం పై ప్రశ్నించలేని నాయకులు వారి వ్యవహారాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర బడ్జెట్ లో ఆదిలాబాద్ అభివృద్ధికి మొండిచేయి చూపారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న ఆరోపించారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి రామన్న పాల్గొని ప్రభుత్వ తీరును ఖండించారు. జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో ప్రారంభమైన చెనక కొరట బ్యారేజ్ కు నిధులు కేటాయించలేదని, ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించకపోవడం సరికాదన్నారు.
నియోజకవర్గానికి 3500 ఇండ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేసిన ఆయన, బడ్జెట్ లో వాటికి నిధులు కేటాయించలేదన్నారు. కేవలం అంకెల గారడీగా బడ్జెట్ ను రూపొందించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను జనాలు గుర్తించాలని సూచించారు.