ఆదిలాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో చేపట్టిన ప్రజాపాలన కళా యాత్రను జిల్లా కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కళాకారులతో ప్రజా విజయోత్సవాలు ఈనెల 19వ తేదీ నుంచి డిసెంబర్ 07 వరకు మండలాల్లోని ఆయా గ్రామాల్లో, మున్సిపాలిటీలలో రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మహాలక్ష్మి, ఇందిరా మహిళాశక్తి, గృహ జ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లపై ప్రచారం చేయనున్నారు. ప్రతి మండలం నుంచి మూడు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రచార రథలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డి.వై.ఎస్.ఓ వెంకటేశ్వర్లు, డీ.పీ.ఆర్.ఓ తిరుమల, టూరిజం ఆఫీసర్ రవీందర్, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, తెలంగాణ సాంస్కృతిక కళాకారులు తదితరులు పాల్గొన్నారు.