డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు కావలసిన మౌలిక వసతులను పూర్తి చేయాలి-కలెక్టర్ బాధావత్ సంతోష్
కల్వకుర్తి (నాగర్ కర్నూల్) (విజయక్రాంతి) : నిరుపేదల కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుర్తి పట్టణంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందించడంలో అలసత్వం వహిస్తున్నారంటూ డబల్ ఇల్లను అప్పగిస్తారా..? అనే వార్త కథనాన్ని విజయక్రాంతి పత్రిక సోమవారం ప్రచురించగా జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ స్పందించారు. నిరుపేదలకు అప్పగించేందుకు కావలసిన మౌలిక వసతులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కల్వకుర్తి పట్టణంలో పూర్తి అయిన 240 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు పంపిణీకి కావలసిన ప్రణాళికలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మిషన్ భగీరథ, విద్యుత్తు సరఫరా, డ్రైనేజీ, రోడ్లు తదితర అవసరాలను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డిఓ శ్రీను, కల్వకుర్తి మున్సిపల్ అధికారులు కల్వకుర్తి తాహసిల్దార్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.