21-02-2025 10:19:14 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు ఎస్సీ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థులతో కలిసి రాత్రి బస చేశారు. వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని రికార్డులు పరిశీలించారు. విద్యార్థులకు వండిన భోజనాన్ని పరిశీలించారు. టీచర్స్, మెస్ కమిటీతో భోజనం ఎలా ఉంటుందని అడిగి తెలుసుకున్నారు. రోజూ వారీగా భోజనాన్ని ఎవరెవరు రుచి చూస్తున్నారని అడిగారు. అలాగే బియ్యం బస్తాలలో ఉన్న బియ్యాన్ని చూసి, బియ్యం స్టాక్ రిజిస్టర్ ను చెక్ చేశారు. బియ్యాన్ని ఎప్పుడెప్పుడు శుభ్రం చేస్తున్నారని వంట ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నించారు. ఏ రోజుకారోజు బియ్యాన్ని శుభ్రం చేస్తామని వారు తెలిపారు. బియ్యంలో పురుగులేమీ రావడం లేదు కదా అని ఆరా తీశారు. రావడం లేదని నిర్వహకులు తెలిపారు.
అలాగే నిల్వ ఉంచిన కూరగాయలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం వస్తే గృహంలో ప్రతి మరుగుదొడ్లను పరిశీలించి ప్రతిరోజు మరుగుదొడ్లను శుభ్రం చేయాలని ఆదేశించారు. వసతి గృహంలో విద్యార్థులు నిద్రించేందుకు ఏర్పాటు చేసిన బెడ్స్ ను పరిశీలించి ఇంతమంది విద్యార్థులు నిద్రించడానికి ఈ బెడ్లు ఎలా సరిపోతాయి, మిగిలిన వారు క్రింద పడుకుంటున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం అల్ఫాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, స్నాక్స్ అందిస్తూన్నారా అని ఆరా తీశారు. ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని విద్యార్థులకు సూచించారు. అంతకముందు విద్యార్థుల స్టడీ అవర్ ను పరిశీలించారు. స్టడీ అవర్లో విద్యార్థులను గణితంలో పలు ప్రశ్నలు అడిగి బోర్డు మీద రాయించారు. ఎలాంటి ఆటలు ఆడుతారని అడిగారు. భవిష్యత్తులో మీరేం అవుతారని, మీ ఆశయం ఏమిటని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
వ్యక్తిత్వ వికాసం పెంపొందించే మంచి మాటలు చెబుతూనే.. జీవిత లక్ష్యం ఏమిటని కుశల ప్రశ్నలను సంధించి విద్యార్థుల నుండి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఎలాంటి వత్తిడి లేకుండా చదవాలని సూచించారు. వెనుకంజలో ఉన్న సబ్జెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టంతో కాకుండా ఇష్టంగా చదవాలని, మానసిక ఒత్తిడికి గురికావొద్దని సూచించారు. పది ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తుకు తొలిమెట్టు అని, భవిష్యత్ లక్ష్య సాధనకు దిక్సూచి అని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిశీలించి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఎస్సీ సంక్షేమ అధికారి అనసూయ, హాస్టల్ వార్డెన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.