మెదక్: మెదక్ జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మహిళా శక్తి భవన నిర్మాణానికి కేటాయించే భూమిని శనివారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా శక్తి భవన నిర్మాణానికి పట్టణ సమీపంలోని జాన్సన్ చౌరస్తా ఐటిఐ కళాశాల వెనుక భాగంలో గల సర్వే నెంబర్ 145/2 లో ఒక ఎకరం భూమి కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు, పంచాయతీ రాజ్ ఈఈ నర్సింలు, తాహసిల్దార్ లక్ష్మణ్ బాబు, సర్వేయర్ యాదగిరితో పాటు తదితరులు పాల్గొన్నారు.