17-02-2025 06:16:22 PM
పాల్వంచ (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ఆశ్రమ, గురుకుల వసతి గృహంలో చేపడుతున్న పనుల పురోగతిని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వసతి గృహం, పాఠశాలల్లో చేపడుతున్న విద్యుదీకరణ, మరుగుదొడ్ల మరమ్మత్తులు పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... 11 మరుగుదొడ్ల మరమ్మత్తులు రేపటి లాగా పూర్తిచేసి, విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చి మిగతా మరుగుదొడ్ల మరమ్మత్తుల పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు బట్టలు ఆరబట్టేందుకు గాను ఏర్పాటు చేసిన పైప్ ఫిట్టింగ్ తాడు పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేసి, జిల్లాలోని మిగతా వసతి గృహాల్లో కూడా ఇదే విధంగా ఏర్పాటు చేయాలన్నారు.
విద్యార్థులకు ఏర్పాటుచేసిన బెడ్లను కలెక్టర్ పరిశీలించి ఇప్పటివరకు ఎన్ని బెడ్లు అందుబాటులోకి వచ్చినవి,ఇంకా ఎన్ని రావలసి ఉన్నది అని ఆరా తీశారు. విద్యార్థుల అందరికీ సరిపడా బెడ్లను ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వసతి గృహంలో చేపడుతున్న పైప్ లైన్ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట డి డి ట్రైబల్ వెల్ఫేర్ మణెమ్మ, ప్రధానోపాధ్యాయుడు బద్రు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.