ఏపీ మండలి చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన హైకోర్టు
అమరావతి, నవంబర్ 6 (విజయక్రాంతి): వైసీపీ నుంచి విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన ఇందుకూరి రఘురాజుకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా రఘురాజుపై అనర్హతవేటు వేస్తూ శాసనమండలి చైర్మన్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఎమ్మెల్సీగా ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ ఆదేశాలను జారీచేసింది. రఘురాజుకు వాదనలు తెలియజేసేందుకు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలోని శాసనమండలి చైర్మన్ అవకాశం ఇవ్వకపోవడాన్ని ఆక్షేపించింది.
సహజ న్యాయసూత్రాలు, చట్ట నిబంధనలకు వ్యతిరేకమని తప్పుపట్టింది. ఈ వివాదాన్ని చైర్మన్ వద్దకు తిరిగి పంపింది. రఘురాజు వాదనలు చెప్పుకొనేందుకు అవకాశం ఇవ్వాలని, ట్రిబ్యునల్ నిర్ణయం ప్రకటించే వరకు రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్టు జస్టిన్ జీ నరేందర్, జస్టిన్ టీసీడీ శేఖర్ తో కూడిన ధర్మాసనం బుధవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోవణలతో మండలిలో వైసీపీ విప్ పీ విక్రాంత్ ఫిర్యాదు మేరకు రఘురాజు ఎమ్మెల్సీగా అనర్హుడని మండలి చైర్మన్ గత జూన్ 3న ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని రఘురాజు తరఫున సీనియర్ లాయర్ జంధ్యాల రవిశంకర్ వాదించారు. పిటిషనర్ భార్య సుధ టీడీపీలో చేరిన కారణంగానే ఆ విధమైన అనర్హత వేటు వేశారని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదిస్తూ.. పిటిషనర్‌కు తన వాదనలు చెప్పుకొనే అవకాశం ఇవ్వలేదన్నారు.
అనర్హత వేటు వేసేందుకు సరైన కారణం ఏమీ లేదన్నారు. వాదనల తర్వాత హైకోర్టు, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రఘురాజుపై అనర్హత వేటు వేసినట్టు కనబడుతోందని అభిప్రాయపడింది. ఎమ్మెల్సీగా రఘురాజు సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.