calender_icon.png 16 April, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్‌చార్జిలే దిక్కు

15-04-2025 12:00:00 AM

  1. జిల్లాలో చాలా శాఖలకు ఇంచార్జ్ అధికారులు
  2. ప్రస్తుతం ఉన్న వారికి అదనపు శాఖల బాధ్యతలు
  3. పెరుగుతున్న పనిభారం.. జిల్లా అభివృద్ధిపై ప్రభావం

సూర్యాపేట, ఏప్రిల్ 14 (విజయక్రాంతి) ః జిల్లాను అధికారుల కొరత వేధిస్తోంది. గత కొన్ని నెలల క్రితం బదిలీల ప్రక్రియ పూర్తయింది. కానీ కీలక శాఖలకు మాత్రం అధికారులు లేరు. కొన్ని శాఖలకు డివిజన్ అధికారు లను జిల్లా అధికారులుగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించగా, మరికొన్ని శాఖలకు అదే శాఖలో పనిచేస్తున్న కింది స్థాయి అధికారులకు బాధ్యతలు ఇచ్చారు.

ఇంకొన్ని శాఖలకు ఇతర శాఖల అధికారు లను ఇన్చార్జిలుగా నియమించారు.మొత్తంగా పూర్తిస్థాయిలో అధికారులు లేకపోవడంతో జిల్లా అభివృద్ధిపై ఆ ప్రభావం పడుతోంది. 

పలు శాఖల్లో ఇలా.

ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో కీలక శాఖల్లో పోస్టుల భర్తీ కావడం లేదు. గత ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోగా.. ఈ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా లోకల్ బాడీస్ అదరపు కలెక్టర్ పోస్టు, డీఆర్వో పోస్టులు గత సంవత్సర కాలంగా ఖాళీగా ఉన్నాయి.

లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్ బాధితులను జిల్లా కలెక్టర్ నిర్వహిస్తుండగా డిఆర్‌ఓ బాధ్యతలను రెవెన్యూ అదనపు కలెక్టర్ చూస్తున్నారు. పూర్తిస్థాయిలో లోకల్ బాడీ అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారి లేకపో వడంతో పాలనపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

పలు శాఖల్లో పరిస్థితిని పరిశీలిస్తే..

జిల్లా జెడ్పీ సీఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న అప్పారావుకు డి ఆర్ డి ఓ గా బాధ్యతలను అప్పగించారు దీంతో జడ్పీ సీఈవో పోస్ట్ ఖాళీగా కావడంతో డిప్యూటీ సీఈవో ఇన్చార్జి సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తుంది. జిల్లా పంచాయతీ అధికారిగా కోదాడ డివిజన్ అధికారి, జిల్లా వ్యవసాయ అధికారిగా సూర్యాపేట డివిజన్ అధికారి ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఎస్సీ కార్పొరేషన్ అధికారికి బీసీ అభివృద్ధి అధికారిగా, ఎస్టీ అభివృద్ధి అధికారికి ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు కేటాయించారు. కార్మిక శాఖలో కోదాడ డివిజన్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి జిల్లా అధికారిగా అదరవ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సిపిఓ, మెప్మా అధికారులుగా ఇంచార్జ్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా ఇంకా ప్రధాన శాఖలతో పాటు డివిజన్ స్థాయి మండల స్థాయిలో కూడా ఇన్చార్జిలపాలని కొనసాగుతుంది. పూర్తిస్థాయి అధికారులు నియమించి ప్రజలకు పాలన చేరువచేయాలని కోరుతున్నారు.