calender_icon.png 3 April, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు తప్పించుకునేందుకే ధర్నా

03-04-2025 01:33:36 AM

రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

ఓటు బ్యాంకుగానే బీసీలు

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): రిజర్వేషన్ల హామీని అమలు చేయకుండా తప్పించుకోవడానికే సీఎం రేవంత్‌రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీలో ధర్నాకు దిగారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాను బీసీలకు 42శాతం రిజర్వేషన్ల హామీని అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఆడిన నాటకంగా బీజేపీ భావిస్తోందని ఓ ప్రకటనలో కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని తాము ముందు నుంచే చెప్తున్నామని గుర్తు చేశారు. సీఎం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారే తప్ప వారి అభివృద్ధికి కృషి చేయడం లేదని ఆరోపించారు. రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు కేంద్రంపై నెపం ఎలా నెడతారని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పెంపు అంశం రాష్ట్ర పరిధిలో లేకపోతే ఎలా హామీ ఇచ్చారని నిలదీశారు. రిజర్వేషన్లు పెంచే ఉద్దేశం లేకే రేవంత్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని కిషర్‌రెడ్డి దుయ్యబట్టారు.

సీఎం రేవంత్‌రెడ్డి అసలైన బీసీ ద్రోహి అని ఆరోపించారు.  ఒక బీసీ వ్యక్తి ప్రధాని అయితే జీర్ణించుకోలేక మోదీని రాహుల్ గాంధీ అసభ్యంగా తూలనాడిన విషయాన్ని బీసీలు ఇంకా మరచిపోలేదన్నారు. కాంగ్రెస్ ముందు నుంచీ బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటూ వచ్చింద న్నారు. బీసీ రిజర్వేషన్లను నెహ్రూ, ఇందిర గాంధీ అడ్డుకున్నారని.. మండల్ కమిషన్ సిఫార్సులను రాజీవ్ గాంధీ పార్లమెంటు వేదికగానే తీవ్రంగా వ్యతిరేకించినట్టు గుర్తు చేశారు.

గత్యంతరం లేకే రిజర్వేషన్ల బిల్లు..

బీసీలకిచ్చిన ఏ హామీని రేవంత్‌రెడ్డి అమలు చేయలేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రిజర్వేషన్లను పెంచుతామని చెప్పి తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయారని విమర్శించారు. ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో గత్యంతరం లేక 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేశారని దుయ్యబట్టారు. బీసీ సంక్షేమం కోసం ఐదేళ్లలో రూ.లక్ష కోట్లను ఖర్చు చేస్తామని చెప్పి బడ్జెట్‌లో ఆ హామీకి అనుగుణంగా కేటాయింపులే జరపలేదన్నారు.

రాష్ట్ర మంత్రి వర్గంలో సైతం బీసీలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదన్నారు. ప్రత్యేక ఎంబీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని చెప్పి, నేటికీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. బీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యాంగబద్ధతను కల్పించింది మోదీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. హామీల అమలులో వైఫల్యాలనుంచి ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్‌రెడ్డి రాజకీయ కుట్రలు చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.