calender_icon.png 26 October, 2024 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

వందేళ్ల పోరాటంతోనే కమ్మ జాతి అభివృద్ధి

22-07-2024 01:40:55 AM

  1. ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు 
  2. ముగిసిన కేజీఎఫ్ సదస్సు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటేందుకు కమ్మ జాతి అత్యంత కీలకమైన పాత్ర పోషించిందని, వందేళ్ల పోరాటం ఫలితంగా కమ్మ జాతి ప్రగతి సాధ్యమైందని పలువురు వక్తలు కొనియాడారు. కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ (కేజీఎఫ్) రెండ్రోజుల గ్లోబల్ సమ్మిట్ హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీలో ఆదివారం ముగిసింది. రెండో రోజు ముగింపు కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ, సినీ ప్రముఖులు హజరయ్యారు. కేజీఎఫ్ ఫౌండర్ జెట్టి కుసుమ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, బళ్లారి బుడా చైర్మన్ ఆంజనేయులు, కర్ణాటక కమ్మ సంఘం నేతలు, సినీ నిర్మాత అశ్వనీదత్, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు మాట్లాడుతూ.. కమ్మ సంఘానికి కేటాయించిన 5 ఎకరాల స్థలం సమస్యను పరిష్కరించి భవన నిర్మాణానికి సహకరిస్తామని చెప్పినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి అభివృద్దికి సహకరించాలని కమ్మ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కమ్మ వారంతా ఒకే వేదికపైకి రావాలన్నారు. ప్రభుత్వాలు ఒక కులాన్ని ద్వేషించడం తగదని హితవు పలికారు. ఎన్టీఆర్ వచ్చాక హైదరాబాద్‌కు వలసలు పెరిగితే, చంద్రబాబు వచ్చాక అమెరికాకు వలసలు పెరిగాయన్నారు. స్వదేశం లోనూ, అమెరికాలోనూ మన పిల్లలకు తెలుగు విధిగా నేర్పాలని కోరారు.

కమ్మ కులంలోని పేద విద్యార్థులకు చేయూత అందించి వారిని ముందంజలో నడిపించేందుకు కృషి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ వందేళ్ల పోరాటం ద్వారానే కమ్మ జాతి ప్రగతి సాధించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఇంటూరి నాగేశ్వరరావు, కాకర్ల సురేష్, గురజాల జగన్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, ఈశ్వర్ రావు, టీడీపీ సీనియర్ నేత జనార్థన్, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, మాగంటి రూప, ఇమ్మణి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

తానా ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్‌తో పాటు యుఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్ తదితర దేశాలతో పాటు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన సుమారు 2 వేల మంది ప్రతినిధులు హజరయ్యారు. అనన్య సూరపనేని గోవర్థన గిరి చేసిన కూచిపూడి నృత్యంతో పాటు పలువురు కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. దివంగత రామోజీరావు పత్రికా రంగంలో హిమశిఖరంగా నిలిచారని కొనియాడుతూ సమ్మిట్ శ్రద్ధాంజలి ఘటించింది. కమ్మ విద్యార్థులకు ఉచిత ఐఏఎస్ కోచింగ్ నిర్వహించాలని, వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయాలని సమ్మిట్  తీర్మానం చేసింది. ఈ సందర్భంగా కేజీఎఫ్ ఫౌండర్‌ను జెట్టి కుసుమకుమార్‌ను ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.