సింగరేణి ఏరియా జిఎం దేవేందర్...
మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని భూగర్భ, ఉపరితల బొగ్గు గనుల్లో జనవరి మాసానికి నిర్దేశించిన లక్ష్యాలలో 91 శాతం బొగ్గు ఉత్పత్తి సాధ్యమైందని ఏరియా జిఎం జి దేవేందర్ తెలిపారు. శనివారం ఏరియాలోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనవరి నెలలో ఏరియాలోని బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వివరించారు. గత డిసెంబర్ నెలతో పోలిస్తే 14,327 టన్నులు బొగ్గు ఉత్పత్తి అధికముగా సాధించడం జరిగిందన్నారు. ఈ నెలలో కేకే 5 గని 116 శాతం, ఆర్కే ఓసిపిలో 299, కాసిపేట 64, కాసిపేట-2, 69, శాంతి ఖని 45, కేకే ఓసిపి గనులు 57 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయనీ అన్నారు. ఏరియాలోని కేకే-5, ఆర్కే ఓసిపి లలో నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి 100 శాతంపైన బొగ్గు ఉత్పత్తి సాధించిన కార్మికులను, అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మిగిలిన గని కార్మికులు, అధికారులు, సూపర్వైజర్లు సమిష్టిగా కృషి చేసి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించి ఏరియాను ప్రగతి పథంలో నడిపించేలా కృషి చేయాలని కోరారు.