29-04-2025 12:59:39 AM
నల్లగొండ, ఏప్రిల్ 28: ధనిక రాష్ట్రమైన తెలంగాణను నాశనం చేసింది బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆరేనని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కృష్ణానది నీటి కేటాయింపులో తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసింది గత ప్రభుత్వమేనని విమర్శించారు.
బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీల నీటిని ఉమ్మడి ఏపీకి కేటాయిస్తే, ఆంధ్రాకు 512 టీఎంసీలిచ్చి, తెలంగాణకు 299 టీఎంసీలే చాలని గత పాలకులు రాసి ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే 500 టీఎంసీలు కావాలంటూ కేంద్రంతో కొట్లాడుతు న్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై లక్ష కోట్లు ఖర్చుపెట్టిన గత ప్రభుత్వం, లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదన్నారు.
పాలమూరు-రంగారెడ్డిపై రూ.27,500 కోట్లు, సీతారాం సాగరంపై రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా నీరందించలేకపోయారని ఆరోపించారు. ఇంకా అనేక ప్రాజెక్టులను పూర్తి చేయని అసమర్థులు బీఆర్‌ఎస్ పాలకులని ఆరోపిం చారు. ఇన్ని రకాలుగా తెలంగాణను అన్యా యం చేసిన కేసీఆర్, ఇయ్యాల ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని వాపోయారు. గత ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో ఎలాంటి ఇరిగేషన్ పనులు చేపట్టలేదన్నారు.
ఎన్నో ఏండ్ల నుంచి రైతులు ఎదురుచూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఏదుల ద్వారా నీరందించేందుకు తామ ప్రభుత్వం రూ.1,800 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. అలాగే హై లెవెల్ కెనాల్‌కు రూ. 442 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. పిల్లాయిపల్లి కాలువ, శివన్నగూడెం నుంచి నారాయణ్‌పూర్, చౌటుప్పల్ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్పనిసరిగా మంజూరు చేస్తామని ప్రకటించారు.
దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్‌తో పాటు, మరో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తిచేస్తామని, అలాగే అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా వేగవంతం చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మేలు చేసే నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేసి, త్వరలోనే స్టేజి వన్ ద్వారా సాగునీరు ఇస్తామ న్నారు. అలాగే రాచకాలువ, గంధమల్ల ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తి చేస్తామన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నారా యణ్‌పూర్, చౌటుప్పల్‌కు కాల్వ విస్తరించి నీరందిస్తామన్నారు.