వనపర్తి, జనవరి 17 ( విజయక్రాంతి ) : రాష్ర్ట ప్రభుత్వం జనవరి 26 నుంచి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాల అమలుకు అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
పథకాలకు అర్హుల గుర్తింపు విషయమై శుక్రవారం కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత మండలాల తహసిల్దార్ కార్యాలయాల్లో అధికారులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించారు.
అనంతరం పథకాలకు అర్హుల గుర్తింపు సర్వే ప్రక్రియ ఎలా జరుగుతుందో పరిశీలించేందుకు కొత్తకోట మండల పరిధిలోని రాయిని పేట, ఆత్మకూరు మండల పరిధిలోని మూల మల్ల, అమరచింత మున్సిపాలిటీ లోని 9వ వార్డ్ లలో సందర్శించి పథకాలకు అర్హుల గుర్తింపు ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో అనే విషయాన్ని పరిశీలించారు.
ఆత్మకూరు మూలమల్ల గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ, ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లో అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం పై వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధంగా సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రైతు భరోసా అమలు కోసం మండల పరిధిలో వ్యవసాయేతర, నాలా భూముల గుర్తింపు ప్రక్రియ పకడ్బందీగా, వేగవంతంగా చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయతర భూములను గుర్తించే ప్రక్రియను చేపట్టిన వ్యవసాయ విస్తరణ అధికారులకు తహసీల్దార్, ఎంఏఓ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ, పర్యవేక్షణ ఉంచాలన్నారు.
ఆలస్యం చేయకుండా వ్యవసాయెతర భూములు, లే అవుట్లు చేసినవి, భూసేకరణ చేసినవి తదితర భూములను గుర్తించలన్నారు. ప్రత్యేక అధికారులు జడ్పీ డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్, బీసీ సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, డిపిఓ సురేష్, తహసిల్దార్లు, ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లు, వ్యవసాయ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.